Jagan new idea on Amaravati: ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు మేలు చేయాలని భావిస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భిన్న వైఖరి అనుసరించింది. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బు అందిస్తే.. వారంతట వారే అభివృద్ధి చెందుతారని భావించింది. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేసింది. కానీ రాజధాని వంటి విషయంలో ఆ పార్టీ వైఖరి చాలా తప్పు. దానికి ఎన్నికల్లోనే మూల్యం చెల్లించుకుంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అక్కడ రిషికొండపై భవనాలు నిర్మించింది. వాటినే ముఖ్యమంత్రి కార్యాలయంగా సంకేతాలు పంపింది. విశాఖలో మంత్రులు ఉండేందుకు ప్రైవేటు భవనాలను సైతం గుర్తించింది. కానీ రాజధాని అంటే ఒకటి రెండు భవనాలు కాదు. రాజధాని అంటే పాలన కేంద్రం. రాజధాని అంటే ఓ రాష్ట్రానికి చిహ్నం. అటువంటిది భారీ భవంతిలో జగన్ ఉండి.. మిగతా మంత్రులు సామంతులుగా విశాఖ నగరంలో మకాం పెడితే అది ఎంత మాత్రం రాజధాని కాదు. దానిని గుర్తించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మీకు రాజధాని ఇచ్చాం అని చెప్పిన విశాఖ నగర ప్రజలు.. ఉత్తరాంధ్రవాసులు దీనిని ఆహ్వానించలేదు. దారుణంగా ఓడించారు.
తప్పిదాన్ని గుర్తిస్తే..
ఇప్పటికైనా అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో జరిగిన తప్పిదాన్ని గుర్తించాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గతానికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి రాజధాని అంశం ఎప్పుడూ ప్రమాదమే. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నిండు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడాన్ని ఆహ్వానించారు. మరింత భూమిని సేకరించాలని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చేసరికి తన అభిప్రాయాన్ని మార్చేశారు. అమరావతి ఒక్కటే కాదు.. మిగతా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పాలనా వికేంద్రీకరణ జరగాలని.. అప్పుడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా చేసి.. ప్రధానమైన పాలన రాజధానిని విశాఖకు మళ్లించి.. రాయలసీమకు న్యాయ రాజధానిగా చూపి.. ఓట్లు కొల్లగొట్టాలని చూశారు. అయితే ఆయన ఒకలా తలిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణ పరాజయాన్ని చూపి.. రాజధాని విషయంలో మీ ఆలోచన తప్పు అన్నట్టు గట్టిగానే సమాధానం చెప్పారు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది.
ప్రచారానికి ఎండ్ కార్డు పడాలని..
అయితే అమరావతి రాజధాని నిర్మాణం పై ఓ స్టాండ్ తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి కూడా ఆయనది. ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఎలాగూ ఆపలేరు. ఎందుకంటే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కుతున్నాయి. పైగా అమరావతికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఇప్పటికీ విషం చిమ్ముతుందని అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అదే సమయంలో జగన్ సొంత మీడియాలో సైతం దీనిపై విపరీతమైన కథనాలు వస్తున్నాయి. అయితే ఇది సరికాదని.. మరోసారి రాజధానుల అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అమరావతి రాజధాని నిర్మాణాన్ని స్వాగతిస్తూ.. దానికి ఒక ఎండ్ కార్డ్ చెప్పాలని సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. మూడు రాజధానుల అంశాన్ని ముగింపు పలికి.. అమరావతి రాజధాని నిర్మాణానికి స్వాగతించి.. అందులో వైఫల్యాలను ఎండగట్టాలన్నది వైసిపి ప్లాన్ గా తెలుస్తోంది. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.