Botsa Satyanarayana: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వైఖరి వింతగా ఉంటుంది. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి రాజకీయాలు సరికొత్తగా మారాయి. అధికార విపక్షాల నేతలు ఒకచోట చేరడం చాలా తక్కువగా మారింది. గతంలో అధికార విపక్షాల మధ్య మంచి స్నేహమే కొనసాగేది. అప్పట్లో చంద్రబాబుతో రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా విభేదించేవారు. కానీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగేది. ఎటువంటి కార్యక్రమాల్లోనైనా వారు ఇట్టే కలిసిపోయేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధం. చివరకు అసెంబ్లీలో స్పీకర్ ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేసారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ మంచి వాతావరణాన్ని కొనసాగించారు. ఓ సీనియర్ నేతగా ఉంటూ తన పార్టీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కానీ నాడు స్పీకర్ తమ్మినేని ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించారు. కానీ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉన్న సమయంలో ఆ పాత్ర పోషించలేకపోయారు జగన్. మరో పార్టీ నేతలతో కలిసేందుకు ఆయన ఇష్టపడరు. అయితే ఆయన వైఖరి తెలిసి కూడా ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యతిరేక పార్టీ నేతలతో కలిసి ఉండడాన్ని జగన్ మరి ఎలా జీర్ణించుకుంటారో.. తాజాగా విజయవాడ లో ఎట్ భవన్ నిర్వహించారు. బొత్స సత్యనారాయణ మంత్రి నారా లోకేష్ తో ఉత్సాహంగా గడిపారు.
* అప్పట్లో పవన్ తో..
గతంలో కూడా బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అలానే వ్యవహరించారు. అసెంబ్లీ వద్ద ఎదురుగా కనిపించేసరికి పరుగెత్తుకుంటూ వెళ్లి పలకరించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. బొత్స వ్యవహరించిన తీరుతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి తెలిసి కూడా బొత్స అలా ప్రవర్తించేసరికి వారిలో ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు లోకేష్ తో సైతం అదే సరదా సంభాషణతో గడిపారు. దీంతో బొత్స జగన్మోహన్ రెడ్డిని లెక్కచేయడం లేదన్న టాక్ నడుస్తోంది. లేకుంటే మరో ఆలోచనతో ఉన్నారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
* బొత్స వైఖరిలో మార్పు..
ఇటీవల బొత్స వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నారు బొత్స. అది క్యాబినెట్ ర్యాంకింగ్ తో కూడుకున్న పదవి. అధికార కూటమికి అడ్డుకట్ట వేస్తారని భావించి జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ పదవి కట్టబెట్టారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ప్రభుత్వ బిల్లులకు అడ్డుపడడం లేదని తెలుస్తోంది. పరోక్ష సహకారం అందిస్తున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వ పెద్దలతో సరదాగానే ఉండడాన్ని జగన్ సహించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ ఏమైనా వేరే ఆలోచనతో ఉన్నారా అని అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే బొత్సకు ఎనలేని ప్రాధాన్యం జగన్ ఇస్తున్నారని.. కానీ బొత్స మాత్రం ఆ స్థాయిలో జగన్ పట్ల అభిమానం చూపలేకపోతున్నారనేది విశ్లేషకుల మాట. అందుకే రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో నిజం ఎంత ఉందో తెలియాలి