YS Jagan Parakamani Case: కొన్ని విషయాల్లో నేతలు వేలు పెట్టకపోవడమే మంచిది. అందునా అనుమానాలు ఉన్నవారు ఎంత దూరం ఉంటే అంత మంచిది. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అడ్డంగా బుక్ అవుతున్నారు. తిరుపతి పరకామణి కేసుకు సంబంధించి తాజాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రతివారం తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటారు. వారాంతపు కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడాలి కానీ.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలపై అడ్డగోలుగా వ్యాఖ్యానిస్తూ బుక్ అవుతున్నారు జగన్మోహన్. తిరుమల పరకామణి కేసులో అలానే మాట్లాడారు. ఆ కేసులో ఏమీ లేనందున తాము క్లోజ్ చేసామని చెప్పుకొచ్చారు. అంటే తమ హయాంలో జరిగిన విషయాన్ని బయటపెట్టి.. విచారణను ఎదుర్కొంటున్న నిందితులను మరింత ఇరకాటంలో పెట్టారు.
* చిన్న ఉద్యోగి పెద్ద సంపాదన..
పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగిలించారు అన్నది రవికుమార్ పై( Ravi Kumar) ఉన్న ఆరోపణ. ఆయన టీటీడీలో తాత్కాలిక ఉద్యోగి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైన వారే. అయితే ఆయన ఓ సాధారణ ఉద్యోగి మాత్రమే. కానీ భారీగా సంపాదన ఉంది ఆయనకు. ఆయన నుంచి భారీగా ఆస్తులను తీసుకొని కేసు రాజీ చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ నాడు ఆయన విదేశీ డాలర్లు దొంగిలించింది 9 మాత్రమేనని.. కానీ ఆయన నుంచి 14 కోట్ల రూపాయలు టీటీడీకి రికవరీ చేశామని గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ ఒక సామాన్య ఉద్యోగి 14 కోట్ల రూపాయలు ఆస్తులు వదులుకున్నారంటే.. ఆయన అక్రమ సంపాదన ఎలా ఉంటుందో తెలుస్తుంది. చిన్నచిన్న లాజిక్కులు మరిచి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అలా మాట్లాడడం ఏమిటనేది ప్రశ్న. విదేశీ డాలర్ల చోరీకి అలవాటు పడిన వ్యక్తితో వందల కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకుని.. టీటీడీకి 14 కోట్ల ఆస్తులు మాత్రమే ఇచ్చారు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్లు అయింది.
* హై ప్రొఫైల్ కేసు పై తేలిగ్గా..
పైగా జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్( Satish Kumar) అనుమానాస్పద మృతి పై మాట్లాడలేదు. విజిలెన్స్ అధికారిగా ఉంటూ ఈ కేసును రాజీ చేసుకున్నారు సతీష్ కుమార్. అదే సతీష్ కుమార్ ఈ కేసు విచారణకు వస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే ఇదో హై ప్రొఫైల్ కేసు. దీనిపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నెన్నో పరిణామాలను చూసుకొని మాట్లాడాలి. కానీ జగన్ మాత్రం తొమ్మిది డాలర్లు దొంగిలించారని.. 14 కోట్ల రూపాయలు టీటీడీకి వదులుకున్నారని ఏవేవో మాట్లాడుతున్నారు. తమ హయాంలో ఒక సాధారణ ఉద్యోగి 14 కోట్ల రూపాయలు కట్టారు అంటే ఆయన సంపాదన ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అది సవ్యంగా సంపాదించిన సంపాదనేనా? ఇలాంటివి తెలుసుకోకుండా తన వారాంతపు ప్రెస్మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం ఆయనకే ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.