Jagan: ఇటీవల జగన్ ప్రసంగ శైలి మారుతోంది. సూటిగా సుత్తి లేకుండా సాగిపోతోంది. సరికొత్త పంచ్ డైలాగులతో సీఎం జగన్ ఆకట్టుకుంటున్నారు. షర్టు మడత పెట్టి.. చేతులు ఊపుతూ చెబుతున్న ప్రసంగాలకు పార్టీ శ్రేణులు ఫిదా అవుతున్నాయి. అయితే జగన్ ప్రసంగాల వెనుక బలమైన స్క్రిప్ట్ రైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఎవరన్నది మాత్రం బయటకు తెలియడం లేదు. జగన్ ఇటీవల తన ప్రసంగాలలో కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారు. సరికొత్త వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసిపి సోషల్ మీడియా వీటినే ట్రోల్ చేస్తోంది.వీటిలో ప్రధానమైనది నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఇటీవల సిద్ధం సభల్లో ఇదే కామెంట్ ను పదేపదే జగన్ చేస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న కామెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అటు మంగ్లీ పాడిన పాటలు సైతం విస్తృతంగా వెళ్లాయి. ఇప్పుడు కూడా జగన్ అటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంది వచ్చే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ లు హైదరాబాదులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. 2014 నుంచి 2019 వరకు జగన్ సైతం ఇదే తరహా విమర్శలు ఎదుర్కొన్నారు.అక్కడ ఉండి మాట్లాడడం కాదు.. ఏపీ వచ్చి మాట్లాడాలని నాటి అధికార పార్టీ నేతలు జగన్ కు సవాల్ చేసేవారు. దీంతో జగన్ 2018లో పాదయాత్రకి దిగారు. తాడేపల్లిలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగారు. 2024 ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భావిస్తున్నారు. అయితే నాటి టిడిపి నేతలు విమర్శలను ఇప్పుడుతిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబుతో పాటు పవన్ హైదరాబాదులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఏపీలో శాశ్వత ఇల్లు లేదు. విజయవాడలో అద్దెనివాసంలో ఉంటున్నారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకునే పనిలో పడ్డారు. మరోవైపు పవన్ సైతం హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇటీవల ఏపీలో సొంత నివాసం పై దృష్టిపెట్టారు. అటు పురందేశ్వరి సైతం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొత్తగా షర్మిల సైతం హైదరాబాదు నుంచి వస్తూ పోతూ ఉన్నారు. ఈ నేతల పరిస్థితిని గమనించిన జగన్ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ చేస్తున్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసేందుకే జగన్ ఏపీకి వచ్చారని.. ఆయన ఎక్కువగా హైదరాబాదులోనే గడిపారని టిడిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ అంశం రెండు పార్టీల మధ్య విమర్శలకు కారణమవుతోంది.