YS Jaganmohan Reddy : జగన్ జనం బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారా? కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేలా ఆయన చర్యలు ఉండబోతున్నాయా? తొలి నాలుగు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆయన భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగింది వైసిపి. కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయింది. కనివిని ఎరుగని పరా జయం ఎదురు కావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. సీనియర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూనియర్లు ఎవరూ మాట్లాడడం లేదు. పార్టీ శ్రేణులు సైతం సైలెంట్ అయిపోయాయి. మరోవైపు కూటమి పార్టీలు పట్టు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో పార్టీని కాపాడుకోవడం పై జగన్ దృష్టి పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా.. తాను గుడ్ బుక్ రాసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అది ప్రత్యర్థుల కోసం కాదని.. తన వారి కోసమని.. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి..అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని విధాలా న్యాయం చేస్తానని జగన్ చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనలు వైసీపీ శ్రేణులకు పెద్దగా స్వాంతన చేకూర్చడం లేదు. గత ఐదేళ్లుగా వారు చాలా రకాలుగా అనుభవాలు చవిచూశారు. అందుకే జగన్ ప్రకటనల విషయంలో నమ్మడం లేదు. అయితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితేనే వైసీపీ శ్రేణులు పార్టీలో కొనసాగుతాయి. లేకుంటే పునరాలోచనలో పడడం ఖాయం. సొంత పార్టీ శ్రేణులు వైసీపీలో కొనసాగాలంటే.. టిడిపి కూటమి ప్రభుత్వంపై కచ్చితంగా వ్యతిరేకత పెంచాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు జగన్.
* సోషల్ మీడియా మరింత బలోపేతం
వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిని పక్కకు తప్పించారు. ఆయన స్థానంలో మరో నేతను తెచ్చారు. భారీగా రిక్రూట్మెంట్ చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా సహకారాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో దాదాపు 100 వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్ లతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అనుసరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల ప్రచారం కోసమే 87 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఫలితాలు వచ్చేవరకు ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు వైసిపి చెప్పిందని వార్తలు వచ్చాయి. ఆది నుంచి ప్రచారం విషయంలో జగన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఈ విషయంలో దూకుడుగా ముందుకు సాగనున్నారు.
* మార్చి నుంచి ప్రజాక్షేత్రంలోకి..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పరిస్థితి పతాక స్థాయికి చేరుతుందని.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని జగన్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రజల్లోకి వస్తే భారీగా స్పందన వస్తుందని.. మునుపటిలా వివిధ అంశాల్లో బాధితులకు ఆర్థిక, హార్దిక సాయం అందించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకతకు తన వాయిస్ తోడైతే వైసీపీకి పూర్వ వైభవం ఖాయమని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఈజీ కాదు. 2019లో అంటే అప్పటి వరకు జగన్ అధికారం చేపట్టలేదు. ఇప్పుడు జగన్ జనాల్లోకి వెళితే గత ఐదేళ్ల పాలన వైఫల్యాలు సైతం బయటపడే అవకాశం ఉంది. వైసీపీ శ్రేణుల్లో అదే రకమైన ఆందోళన కనిపిస్తోంది. కానీ జగన్ మాత్రం ప్రభుత్వం పై వ్యతిరేకతను పెంచాలని చూస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagan is taking steps to increase opposition to the coalition government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com