Jagan: ఏపీలో ఎన్నికల హీట్ ప్రారంభమైంది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్నాయి. సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నారు. ‘సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు వైసిపి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. భారీ జన సమీకరణకు తెర తీస్తోంది. గతానికంటే భిన్నంగా ఈ సభలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ర్యాంపు వాక్ తో కార్యకర్తల మధ్యకు వచ్చి జగన్ ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర నుంచి భారీగా ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేయడం విశేషం.
రెండోసారి విజయం సాధించాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. అంతకుముందే పార్టీ క్యాడర్ తో మమేకం కావాలని నిర్ణయించారు. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. మొత్తం ఐదు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి సభను భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సభలో జగన్ కీలక ప్రసంగం చేయడంతో పాటు కార్యకర్తలతోనూ మాట్లాడించునన్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అక్కడే విపక్ష పార్టీల ఆరోపణలు.. కుమ్మక్కు రాజకీయాలు.. తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలను వివరిస్తూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలో దిశా నిర్దేశం చేయనున్నారు.
అయితే ఈ సభలతో వైసిపి స్టైల్ మార్చనుంది. సాధారణ సభలు కంటే భిన్నంగా నిర్వహించనున్నారు. జగన్ ర్యాంప్ వాక్ చేయనున్నారు. తన 56 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం గురించి జగన్ వివరించనున్నారు. జగన్ ను అధికారం నుంచి దించాలని చంద్రబాబు, పవన్ లు కలిశారు. వారిని ఎలా ఎదుర్కొనాలో పార్టీ శ్రేణులకు జగన్ వివరించనున్నారు. ప్రతిపక్షాలను ఎలా తిప్పి కొట్టాలి, ప్రజలను ఎలా ఆకర్షించాలి అన్నది అర్థమయ్యేలా.. చక్కటి సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా కార్యకర్తలను తరలించాలని హై కమాండ్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ సభతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాలని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. వైసిపి అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ.. గెలుపే ప్రామాణికంగా ఈ ఎంపికలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అటు పవన్ సైతం ఈ నెలాఖరు నుంచి పర్యటనలను ప్రారంభించనున్నారు. వారిద్దరికీ ధీటుగా ప్రచార సభలు ఉండాలని జగన్ భావిస్తున్నారు. అందుకే సిద్ధం పేరిట ఎన్నికల యుద్ధానికి సిద్ధపడేలా సభలు ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యారు. అయితే కొత్తగా షర్మిల ఎంట్రీ తో వైసీపీ శ్రేణులు ఒక రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానిపై సైతం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.