Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ కు భయపడుతున్న జగన్

Nara Lokesh: లోకేష్ కు భయపడుతున్న జగన్

Nara Lokesh: మంగళగిరిలో లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. లోకేష్ పై గట్టి అభ్యర్థిని దించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు అభ్యర్థులను తెరపైకి తెచ్చారు. నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు అభ్యర్థులను మార్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పు పార్టీకి నష్టమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోకేష్ అక్కడ పట్టు బిగించడం వల్లే జగన్ ఈ మార్పులు చేస్తున్నారన్న కామెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది అంతిమంగా నష్టం చేకూరుస్తుందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.

మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన తొలిసారిగా మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో సైతం రెండోసారి బరిలో దిగి గెలిచారు. జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టారు. విస్తరణలో సైతం చోటు దక్కలేదు. టికెట్ విషయానికి వచ్చేసరికి.. సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ పక్కన పెట్టారు. చేనేత వర్గం అధికంగా ఉండడంతో.. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని టిడిపి నుంచి వైసీపీలోకి రప్పించారు. టికెట్ కట్టబెట్టారు. ఆయన కూడా పెద్దగా ప్రజలను ఆకర్షించ లేకపోవడంతో తాజాగా సైడ్ చేశారు. మురుగుడు లావణ్యను తెరపైకి తెచ్చారు.

కాంగ్రెస్ లోకి వెళ్లి పోయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తిరిగి రప్పించడం వెనుక చాలా కథ నడిచినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ నారా లోకేష్ ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు. అయినా ఓడిపోయారు. రాజధాని ప్రాంతం కావడంతో.. వైసీపీపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెనక్కి రప్పించారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కోడలు మురుగుడు లావణ్యను బరిలోదించారు. అటు ఎమ్మెల్సీగా మురుగుడు హనుమంతరావు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి గెలుపు బాధ్యతలను అప్పగించారు. అయితే ఈ పరిణామాల క్రమంలో తరచూ అభ్యర్థులను మార్చుతుండడంతో వైసిపి శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ప్రజలకు కూడా ఒక తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి.

మరోవైపు నారా లోకేష్ నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంతర్గతంగా పని చేసుకుంటూ పోతున్నారు. చాలామంది తటస్థులను కలిసి మద్దతు కోరారు. వారంతా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ పార్టీ బాధ్యతలను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు అప్పగించారు. ఆమె పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, రాజధాని అంశం ప్రభావం అధికంగా ఉంటుందని తెలుస్తోంది. జగన్ మాత్రం సంక్షేమ పథకాలతో పాటు సామాజిక సమీకరణలతో అధిగమించాలని చూస్తున్నారు. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular