Sajjala Ramakrishna Reddy : వైసీపీ ఉద్యమ బాట పట్టింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందుకుగాను ప్రజల మధ్యకు వెళ్లాలని భావిస్తోంది. భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదన్నది వైసిపి నుంచి వినిపిస్తున్న మాట. అందుకే ప్రజల్లోకి వెళ్లి నిలదీయాలని చూస్తోంది. ఇటీవల ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచింది. ధాన్యం కొనుగోలు కూడా ఆశాజనకంగా జరగడం లేదన్నది వైసిపి చేస్తున్న ఆరోపణ. అందుకే ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళనలు చేయాలన్నది వైసిపి వ్యూహం. అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరపాలని కూడా నిర్ణయించింది. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కారంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు.
* మరోసారి సమన్వయ బాధ్యతలు
అయితే రాష్ట్రస్థాయిలో వైసిపి నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులతో మాట్లాడారు. వారికి దిశ నిర్దేశం చేశారు. 13వ తేదీన నిర్వహించాల్సిన ఆందోళన పై చర్చించారు. రైతులకు సంబంధించి అన్ని అంశాలను ప్రస్తావించాలని.. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
* ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా
వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందన్నది ప్రతిపక్షాల నుంచి వచ్చిన మాట. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడానికి సజ్జల తీరు కారణమని ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోని సీనియర్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు అధినేతకు ఫిర్యాదు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం సజ్జలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్రస్థాయిలో కోఆర్డినేటర్ గా సజ్జల నియామకం చేపట్టారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాల సమన్వయ బాధ్యతను సైతం సజ్జలకు అప్పగించడం విశేషం.