YS Jagan : విజయమ్మను వదులుకున్న జగన్.. వైసీపీ నేతలు కోరుకుంటుంది అదే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై వైసీపీ నేతల వ్యవహార శైలి మారుతోందా? ఆ కుటుంబ సభ్యులను సైతం రాజకీయ ప్రత్యర్థులుగా చూడనున్నారా? షర్మిల తో పాటు విజయమ్మ ఈ జాబితాలోకి వస్తారా? ఈ ఎన్నికల్లో వైసీపీకి వారే డ్యామేజ్ చేశారా? జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అందుకే వైసీపీ నేతలు విజయమ్మతో పాటు షర్మిలను తప్పు పట్టడం ప్రారంభించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. వైసీపీలో చీమ చిటుకుమనాలన్నా.. పార్టీ అధినేత అనుమతి లేకుండా కాదు. అటువంటిది ఇటీవల వైసిపి నేతలు నేరుగా విజయమ్మపై విమర్శలకు దిగుతున్నారు. ఇన్ని రోజులు సానుకూల భావనతో చూసినవారు.. ఓటమిపై సమీక్షించే క్రమంలో విజయమ్మ తీరును తప్పుపడుతున్నారు.
వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేసినంత వరకు విజయమ్మ వ్యవహార శైలిపై.. వైసీపీ నేతలకు ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కావు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి.. ఆమె కుమార్తెకు అండగా ఉంటానని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. తల్లిని, చెల్లిని జగన్ తరిమేశాడని ప్రత్యర్ధులు విమర్శించినా.. పార్టీ శ్రేణులుమాత్రం నమ్మలేదు. ముఖ్యంగా విజయమ్మ విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే చూసేవారు. అటు విజయమ్మ సైతం అవకాశం ఉన్న సమయాల్లో కుమారుడిని కలుపుేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆమె నేరుగా షర్మిలకు అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్కు ముందు ఒకరోజు విడుదల చేసిన ఈ వీడియో రాయలసీమలో విపరీతమైన ప్రభావం చూపింది. వైసీపీ దారుణ ఓటమికి కారణమైంది.
ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా.. షర్మిల మాత్రం ఇంకా టార్గెట్ ను కొనసాగిస్తున్నారు. పూర్తిగా వైసిపి నిర్వీర్యం అయితే కానీ తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. అందుకే జగన్ పై విరుచుకు పడుతూనే ఉన్నారు. షర్మిల ప్రయత్నాన్ని గమనించారు జగన్. తల్లి విజయమ్మ సైతం చివరి వరకు షర్మిలకు అండగా నిలబడతారని స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు విజయమ్మను సైతం వదులుకునేందుకు జగన్ సిద్ధపడ్డారని తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీలో సీనియర్ నేతలుగా ముద్రపడిన పేర్ని నాని, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు విజయమ్మ వైసీపీని దారుణంగా దెబ్బతీశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ అనుమతి లేనిదే వారు అలా మాట్లాడరు. కచ్చితంగా ఈ వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిలను మాత్రమే గెలిపించాలని విజయమ్మ కోరారు. జగన్ ను గెలిపించాలని కానీ.. మిగతా నియోజకవర్గాల్లోవైసీపీని ఆదరించాలని కానీ.. విజ్ఞప్తి చేయలేదు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల్లో విజయమ్మ పై ఆగ్రహానికి అదే కారణం. జగన్ సైతం ఎప్పటికైనా తల్లి విజయమ్మతో ఇబ్బందికర పరిణామం ఎదురవుతుందని తెలిసి.. ఆమెను వదులుకునేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. పూర్తిగా షర్మిల వైపు విజయమ్మ వెళ్లిపోతే.. దానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలని జగన్ చూస్తున్నారు. కుటుంబ పరంగా ఎటువంటి డ్యామేజ్ జరగదు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉంటేనే క్లియర్ కట్ గా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని.. ఈ క్రమంలో తల్లి అటు ఇటుగా వెళ్లి వస్తే అసలు వస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో సునీత, ఆమె తల్లితో పాటు కొందరు కుటుంబ సభ్యులు వ్యతిరేకమయ్యారు. ఈ తరుణంలో ప్రజల్లోకి ఒక బలమైన నినాదం ఇప్పటికే వెళ్లిపోయింది. అందుకే తల్లిని వదులుకోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు సమాచారం. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.