Jagan Congress Alliance Talks: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. టిడిపి కూటమి అధికారంలో ఉంది. ఇందులో బిజెపి భాగస్వామిగా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. బిజెపి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో టిడిపి తో పాటు జనసేన కీలక భాగస్వామిగా ఉన్నాయి. జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉంది. అయితే టిడిపి తో పాటు జనసేన ను వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏపీలో. కేంద్రంలో ఎన్డీఏను పల్లెత్తు మాట అనడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ను మాత్రం విమర్శిస్తున్నారు జగన్. బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారు అనేది రాజకీయ కామెంట్. కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతోనే ఆయన విషయంలో బిజెపి సాఫ్ట్ కార్నర్ ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ సమయంలో బిజెపితో పరోక్ష స్నేహం అనే మాట ప్రజల్లోకి వెళితే తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తుండడంతో.. కాంగ్రెస్ తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందోనని ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైయస్ కుటుంబంతో సాన్నిహిత్యం..
జగన్ మనసు మారడం వెనుక కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. డీకే శివకుమార్ వైయస్సార్ కుటుంబ సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి కూడా. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఆయన ఎదుగుదల వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారనే ఒక టాక్ ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం పై అభిమానంతోనే డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపి దాదాపు జగన్మోహన్ రెడ్డికి తలుపులు మూసినట్టే. ఆపై పొత్తు కూడా కొనసాగనుంది ఆ మూడు పార్టీల మధ్య. అందుకే ఇప్పుడు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఏర్పడింది.
కేవలం ఆ భయంతోనే..
జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే ఏపీలో తన ఓటు బ్యాంకు కచ్చితంగా టర్న్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలపడుతుందా? ఎప్పుడు చేరుదామా? అన్న రీతిలో చాలామంది వైసిపి నేతలు ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఉన్న 90 శాతం నేతలు, క్యాడర్ కాంగ్రెస్ పార్టీదే. అందుకే జగన్మోహన్ రెడ్డిలో కూడా భయం వెంటాడుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఒంటరిగా ఉంటే ఎటు కాకుండా పోతామన్న భయం ఆయనలో ఉంది. పైగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో డీకే శివకుమార్ తో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
