Jagan Contest From Jamalamadugu Assembly: 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ అవుతూనే పార్టీని ఏపీలో మరింత బలోపేతం చేస్తూ ముందుకెళుతున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనీ జగన్మోహన్ రెడ్డికి తనకు కలిసివచ్చిన పులివెందుల సీటును సైతం రాబోయే ఎన్నికల్లో త్యాగం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి వైఎస్ కుటుంబమే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఘన విజయాలు సాధించారు. పులివెందుల బిడ్డ, పులివెందుల పులిగా వీరద్దరు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీ సాధించి రాష్ట్రస్థాయిలో రికార్డు నెలకొల్పారు.
పులివెందులలో వైఎస్ కుటుంబానికి తిరుగులేదు. సమీప భవిష్యత్తులోనూ ఈ స్థానంలో వారిదే హవా సాగనుంది. అయితే వైఎస్ వివేకానంద హత్య తర్వాత ఆ ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్నాయి. వివేకనంద కూతురు సునీత తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్ హస్తం ఉందంటూ ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వీటికి చెక్ పెట్టేలా జగన్మోహన్ ప్లాన్ చేస్తున్నారు.
వైఎస్ వివేకానంద హత్య అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే పులివెందుల సీటును ఈసారి వైఎస్ వివేకానంద కూతురు సునీతకు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కడప ఎంపీ సీటును సైతం అవినాష్ రెడ్డి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి పులివెందుల నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేస్తారని టాక్ విన్పిస్తోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని లోకల్ గా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే సీఎం జగన్ జమ్మలమడుగుపై ప్రత్యేక దృష్టిసారించినట్లు కన్పిస్తోంది. పులివెందుల తర్వాత వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగుపై మంచిపట్టు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ గా ఈ ప్రాంతంలో సేవలందించారు. నాటి నుంచి ఆ ప్రాంతంతో ఆ కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డికి సీటు దక్కింది. ఈ ఎన్నికల్లో దేవగుడి ఫ్యామిలీ, రామసుబ్బారెడ్డి వర్గం వైసీపీకి వ్యతిరేకంగా పని చేసింది. అయినప్పటికీ జమ్మలమడుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్న సుధీర్ రెడ్డికే పట్టంకట్టారు. భారీ మెజార్టీతో సుధీర్ రెడ్డి విజయం సాధించగా ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.
ఇక ఈసారి జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే మాత్రం ఆయన గెలుపు నల్లరుపై నడక అనే చెప్పొచ్చు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఉన్న పులివెందుల రికార్డును జగన్మోహన్ రెడ్డి ఇకపై జమ్మలమడుగుపై చేర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!