Jagan Come to Assembly: ఏపీ( Andhra Pradesh) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి నాలుగో సమావేశాలు. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ప్రచారం నడిచింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన సమావేశాలకు హాజరైతే మంచిదని వైసీపీ సీనియర్లు సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయన పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్ నడిచింది. మరోవైపు ఈ సమావేశాలకు హాజరు కాకుంటే నిబంధనల మేరకు.. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని కూటమి నేతల నుంచి వినిపించింది. త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందని.. జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుంటే జరిగేది అదేనని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి చలనం లేదు.
ప్రతిపక్ష హోదా సాకుతో..
గడిచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అందుకే నిబంధనల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి రానని తెగేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అన్నట్టుగానే గత మూడు సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఈసారి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చేలా లేరు. జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా లేరు. దీంతో వీరందరిపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడుతుందా? ఏం జరుగుతుంది? అనే చర్చ నడుస్తోంది. అయితే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోగలదా? అంటే మౌనమే సమాధానం అవుతోంది.
చంద్రబాబుకు ఎదురైన పరిణామాలు..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నాడు 23 స్థానాలకే పరిమితం అయింది తెలుగుదేశం( Telugu Desam). సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు హుందాగా సభకు వచ్చారు. నాటి గవర్నర్ ప్రసంగం వినడమే కాదు.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంపిక సమయంలో సైతం ప్రతిపక్ష గౌరవ పాత్ర పోషించారు. అయితే నాడు చంద్రబాబును టార్గెట్ చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చిపోయారు. కానీ చంద్రబాబు వాటన్నింటినీ తట్టుకొని శాసనసభలో నిలబడ్డారు. అయితే ఆయన కుటుంబం పై దాడి, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కామెంట్స్ చేశారు. దీంతో ఆ వయసులో కూడా చంద్రబాబు ఏమీ చేయలేక బోరున ఏడ్చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు ఎదురైన అవమానాలన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుభవమే. ఎందుకంటే నాడు శాసనసభలో ఆయన కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకొని.. ఇవ్వలేదని సాకు చూపి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఇప్పుడు నిబంధనల ప్రకారం 60 రోజులు సెషన్స్కు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందన్న భయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. అయితే అనర్హత వేటు ద్వారా సానుభూతి పొందుతామని.. కానీ సభకు వెళ్లే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. కానీ ఓ ఆరుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. సభకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇంకా సమయం ఉండడంతో దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఎలా ఉండబోతుందో చూడాలి.