Nara Lokesh mass teasing: ఏపీ రాజధానికి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త హైలైట్ గా నిలుస్తూనే ఉంటుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతూ వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో రకాల విమర్శలు, ప్రచారాలు సర్వసాధారణం అయ్యాయి. వాటిని పట్టించుకునే స్థితిలో లేదు కూటమి ప్రభుత్వం. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మావిగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆయన విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం దీనిని తప్పు పట్టారు. అది బుర్ర లేని ఆలోచనగా తేల్చేశారు. మావిగన్ ప్రతిపాదన తీవ్ర ప్రతికూలత రావడంతో దానిని మరిచిపోయేలా ఎత్తుగడవేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీవీ డిబేట్లో సైతం ఆ పార్టీ నేతలు ఆ ప్రస్తావన మరిచిపోయారు. అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి పై సర్టైరికల్ పోస్ట్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ మూడింటిని కలుపుతూ…
రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికర సూచన చేశారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు కారిడార్ను తీసుకొని రాజధానిగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ తీసుకొని మావిగన్ అని పేరు పెడితే బాగుంటుంది అని సూచించారు. దీంతో విపరీతంగా ట్రోల్స్ అయ్యారు. ఇప్పుడు దానిని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. బెంతహై అంటూ ఆయన చేసిన సూచన జగన్ పై సాటిరికల్ గా ఉంది. బెంగళూరు- తాడేపల్లి- హైదరాబాద్ కు షటిల్ సర్వీసులు చేసే జగన్ ఇంగ్లీష్ అక్షరాలను కలుపుతూ బెంతహై అనే పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇది కూడా విపరీతంగా ట్రోల్ అవుతోంది జగన్ పై.
అడ్డంగా బుక్ అవుతూ..
జగన్ వారం వారం మీడియా ముందుకు వస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నేతల పరామర్శలకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు సైతం ట్రోల్స్ అవుతున్నాయి. ఆపై ఆయన ముఖ కవళికలను సైతం వదలడం లేదు. అదే పనిగా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. మావిగన్ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ గా మారింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా పరిగణించింది. దానిపై ముందుకు వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అందుకే టీవీ డిబేట్లో సైతం ప్రస్తావించడం లేదు. ఇటువంటి తరుణంలో మావిగన్ ను గుర్తుచేసి బెంతహై పేరుతో ఒక ఆట ఆడుకున్నారు మంత్రి నారా లోకేష్.