YSRCP : వైసీపీ నేతల్లో కొందరిది వింత పరిస్థితి.సొంత పార్టీలో ఆదరణ లేదు. ఇతర పార్టీలోకి వెళ్తామంటే ఆహ్వానం లేదు. ఇక్కడ ఉంటే పట్టించుకునే వారు లేరు. అందుకే ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు.కొందరు పార్టీని వీడి స్తబ్దుగా ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వైసిపి ఓడిపోయిన వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటుడు అలీ పరిస్థితి కూడా అదే. ఇంకా సిద్దా రాఘవరావు,కిలారు రోశయ్య, మద్దాలి గిరి, ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ ఏ పార్టీలో ఇంతవరకు చేరలేదు. చివరకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ పదవులు వదులుకున్నారు. కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. అసలు వైసీపీని వీడుతున్న వారి పరిస్థితి ఏంటి? వారికి ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందా?లేకుంటే సొంత పార్టీపై నమ్మకం లేదా? అధినేత వారిని గౌరవించడం లేదా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు పది మంది వరకు పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ అందులో ఒక్కరు కూడా ఇద్దర పార్టీల్లో చేరలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* అజ్ఞాతంలోకి కొందరు
ఇంకా వైసీపీలో చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు. ఎక్కడున్నారో వారు తెలియడం లేదు అందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. పార్టీ శ్రేణులను కలవడం లేదు. కేవలం తన అనుచరులను మాత్రమే కలుస్తున్నారు. అసలు ఆయన పార్టీలో ఉంటారో? ఉండరో? తెలియని పరిస్థితి. ఇప్పటికే రాజకీయ సన్యాసం చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించి.. కుమారుడికి ఒక మార్గం చూపాలని భావిస్తున్నారు.
* బాలినేని రూట్ సెపరేట్
మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి మరోలా ఉంది. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని భయపెడుతున్నారు. జనసేనలోకి వెళ్తానని సంకేతాలు ఇస్తున్నారు. అనుచరులను టిడిపిలోకి పంపిస్తున్నారు. మిగిలినవారికి జగన్ వద్దకు పంపిస్తున్నారు. వైసీపీకి బాలినేని నాయకత్వం అవసరమని సూచించాలని చెబుతున్నారు. ఆయనకు పార్టీలోనే ఉండాలని ఉంది. కానీ జగన్ నాయకత్వం బాధ్యతలు అప్పగించడం లేదు. పార్టీ నుంచి బయటకు అడుగు పెట్టాలని ఉంది. కానీ కూటమి పార్టీల్లో ఖాళీలు లేవు. అందుకే కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.
* కనిపించని ఫైర్ బ్రాండ్లు
ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఉండేవారు. ప్రత్యర్ధులు ఒక మాట అంటే పది మాటలతో విరుచుకుపడేవారు. తప్పైనా గట్టిగా వాదించేవారు. అటువంటి వారు ఇప్పుడు కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. ఆదిలో గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు వంటి వారు మాట్లాడేవారు. కానీ వారు కూడా తగ్గించేశారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎంతో కొంత పార్టీకి భరోసా కల్పిస్తున్నారు పేర్ని నాని, అంబటి రాంబాబు. మిగతావారు పార్టీ తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఉంటే సైలెంట్ గా ఉంటున్నారు. ఉండలేని వారు బయటకు వెళ్తున్నారు. అలాగని వారు ఏ పార్టీల్లో చేరడం లేదు. వైసీపీకి మాత్రం దూరం జరుగుతున్నారు. ఇది వైసీపీలో ఉన్నవారికి మింగుడు పడని విషయం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More