Social pensions : సామాజిక పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వారికి తీపి కబురు చెప్పింది. గతంలో పింఛన్లు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పింఛన్ ను బదిలీ అవకాశం కల్పించింది. ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పింఛన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. పింఛన్ ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్నవారు ప్రస్తుతం వారు పింఛన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. పింఛన్ బదిలీకి దరఖాస్తు తో పాటుగా పింఛన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో… ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది. ఆధార్ జిరాక్స్ కూడా అందజేయాల్సి ఉంటుంది. సామాజిక పింఛన్ వెబ్సైట్లో ప్రభుత్వం బదిలీ ఆప్షన్ ఇచ్చింది. స్వగ్రామాలకు రాలేని వారు.. పాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకుంటే పింఛన్ల పంపిణీ శాతం మరింత పెరిగేందుకు దోహదపడుతుంది అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆప్షన్ ప్రతినెలా ఉంటుందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ఆది నుంచి ప్రత్యేకంగా ఫోకస్
సామాజిక పింఛన్ల విషయంలో చంద్రబాబు సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు వేల రూపాయల మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి వర్తింప చేస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే జూలై నెలలో.. పెండింగ్ 3 వేల తో పాటు పెంచిన 4000 కలిపి 7000 రూపాయలు అందించారు. ఆగస్టు నెలకు సంబంధించి కూడా విజయవంతంగా పింఛన్ అందజేయగలిగారు. అయితే సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో.. ఒకరోజు ముందుగానే పింఛన్ అందించి లబ్ధిదారుల నుంచి అభినందనలు అందుకుంది ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయినా పింఛన్ అందుకునే వెసులుబాటు కల్పించింది.
* వారికి ఉపయోగం
చాలామంది పింఛన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటారు. ఉద్యోగ ఉపాధి రీత్యా బయటకు వెళ్ళిన వారు. వృద్ధాప్యంలో పిల్లల చెంతన ఉండేవారు ఉంటారు. అటువంటివారు పింఛన్ అందుకునే సమయంలో ప్రయాసలకు గురవుతున్నారు. గతంలో ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకునే అవకాశం ఉండేది. దానినే పునరుద్ధరించాలని లబ్ధిదారులు కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. లబ్ధిదారుల సౌకర్యార్థం ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది.
* బోగస్ ఏరివేత
మరోవైపు పింఛన్ లబ్ధిదారులపై కత్తి వేలాడుతోంది. చాలామంది వికలాంగ పింఛన్ లబ్ధిదారులు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు అందుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. అయితే 60 వేల మంది వరకు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్నారన్నది ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీటిపై విచారణ పూర్తి చేసి ఫేక్ అని తేలితే పింఛన్లు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More