https://oktelugu.com/

Jagan-Sharmila :జగన్ , షర్మిల యుద్ధంలో.. మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే?

మొన్నటిదాకా షర్మిల - జగన్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముఖం చాటేసుకున్నారు. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి షర్మిల కూడా తన వంతుగా ఒక చేయి వేశారు. ఫలితంగా ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఐదు సంవత్సరాలకే పరిమితమైపోయారు. 151 సీట్లు గెలుచుకున్న రికార్డ్ సృష్టించిన ఆయన.. కేవలం 11 సీట్ల వద్ద మాత్రమే ఆగిపోయారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 22, 2024 / 08:04 PM IST

    Jagan-Sharmila

    Follow us on

    Jagan-Sharmila : జగన్మోహన్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు ప్రాధాన్యం తగ్గిందన్నమాట వాస్తవం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డికి దక్కిన విలువలో ఆమెకు ఒక్కశాతం కూడా దక్కలేదనేది వైసీపీలోనే చాలామంది నాయకులు చెబుతున్న మాట. అయితే అయిన వారిని దూరం చేసుకోవడంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా వాస్తవం. జగన్ ముఖ్యమంత్రి కావడం వెనక షర్మిల చాలా త్యాగాలు చేశారు. ఇది కాదనలేని వాస్తవం. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బై బై బాబు అంటూ నినదించారు.. ఫ్యాన్ గుర్తును ప్రతి పల్లెకు తీసుకెళ్లారు.. ఆనాడు షర్మిల చేసిన యాత్ర ఆంధ్రజ్యోతికి వార్తలాగా కనిపించలేదు. ఈనాడుకు ఏ మాత్రం ఆనలేదు. నాడు షర్మిల చేసిన పోరాటం ఆ రెండు పత్రికల దృష్టిలో అధర్మ పోరాటం. నేడు షర్మిల జగన్ పై చేస్తున్న యుద్ధం ఆంధ్రజ్యోతి, ఈనాడు కోణంలో ధర్మ యుద్ధం. నాడు సాక్షి షర్మిలను ఆకాశానికి ఎత్తేస్తే… నేడు చంద్రబాబు బాణమంటూ పాతాళానికి పడేసింది. ఇందులో ఎవరి రాజకీయ లెక్కలు వారికి ఉన్నాయి. కాకపోతే షర్మిల చేసిన ఒక పెద్ద తప్పు ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. షర్మిలకు తన అన్న తప్పుడు దారిలో వెళ్తున్నాడని తెలిసినప్పుడు.. అప్పుడే బయటికి వచ్చి ఉంటే కథ వేరే విధంగా ఉండేది. అంతటి కరోనా సమయంలో కూడా ఇక్కడే ఉండి.. జగన్ కు వ్యతిరేకంగా.. ఆయన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే షర్మిలపై ఖచ్చితంగా ఏపీ ప్రజలకు నమ్మకం ఉండేది. కానీ షర్మిల ఆ పని చేయలేదు. పైగా ఆమె ఏపీకి దూరంగా ఉన్నారు. ఉన్నట్టుండి బయటకు వచ్చారు. ఏపీలో కాకుండా తెలంగాణ నుంచి పోరాటం మొదలుపెట్టారు.

    దానికోసమే పార్టీ పెట్టారా?

    ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డిని బెదిరించడానికే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని విమర్శలున్నాయి. ఆ తర్వాత ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడు షర్మిల ఎందుకోసం పార్టీ పెట్టారో? ప్రజలు ఎలా పట్టించుకుంటారని భావించారో? షర్మిలకే తెలియాలి. పైగా పార్టీ ఏర్పాటు వల్ల ఆమె భారీగా ఖర్చుపెట్టారు. పైగా తన పార్టీని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆంధ్రజ్యోతికి జాకెట్ యాడ్స్ ఇచ్చారు. వేమూరి రాధాకృష్ణకు ఓపెన్ హార్ట్ ఆర్కే ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటోరియల్ వ్యాసాలు కూడా రాశారు. సాక్షిలో ఎలాగూ తనకు స్పేస్ ఇవ్వరు.. ఈనాడులో పెద్దగా పట్టించుకోరు కాబట్టి.. నాడు షర్మిల ఆంధ్రజ్యోతికి దగ్గరయ్యారు.. రాధాకృష్ణకు మరో చెల్లెలయ్యారు.

    జగన్ ఎందుకు లొంగుతాడు?

    నాడు షర్మిల బెదిరింపులకు జగన్ లొంగినట్టు కనిపించలేదు. పైగా మధ్యలో ఏవేవో వార్తలు వినిపించినప్పటికీ.. జగన్ నుంచి విసమెత్తు స్పందన కూడా లేదు.. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్ రాయబారానికి పిలిచాడని.. ఆస్తుల పంపకాలు జరిగిపోతున్నాయని ఆంధ్రజ్యోతి కథనాల మీద కథనాలు రాస్తున్నది. షర్మిలను వీర వనితలాగా, ధీర మహిళ లాగా ప్రచారం చేస్తోంది.. వాస్తవానికి షర్మిల పోరాటం నిజమైతే ఆమె ఆస్తి కోసం మాత్రమే పోరాటం చేశారా? రాజకీయ విలువల కోసం పోరాటం చేశారా? రాజన్న రాజ్యం కోసం పోరాటం చేశారా? అంతిమంగా ఆస్తుల కోసమే ఆమె పోరాటం చేసి ఉంటే అది ధర్మ యుద్ధం ఎలా అవుతుంది? పాపం ఈ ప్రశ్నకే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వద్ద సమాధానం లేనట్టుంది. మరోవైపు అన్నా చెల్లెళ్లు కలిసిపోతున్నారని.. మరికొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. రాజకీయాలలో అలా జరగకుండా ఉండదనడానికి లేదు. ఎందుకంటే నేటి రాజకీయాల్లో విలువలు లేవు. విశ్వసనీయత అంతకన్నా లేదు. డబ్బు పూర్తిగా శాసిస్తున్నప్పుడు.. సరిగ్గా పంపకాలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును జనం వద్దనుకుంటారు. అప్పుడు ప్రత్యామ్నాయంగా జగన్ కు జై కొడతారు. అంటే ఇక్కడ జగన్ గొప్ప పరిపాలకుడని కాదు. స్థూలంగా షర్మిల – జగన్ ఎపిసోడ్ లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఉందంటే డబ్బు మాత్రమే. ఎందుకంటే అన్నా చెల్లెలి అనుబంధం.. అనే మాట కేవలం సినిమాలకు మాత్రమే పనికొస్తుంది. అంతిమంగా రియాల్టీని డబ్బు మాత్రమే నడిపిస్తుంది.