Minister Vishwaroop : పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి ఉంది. వారాహి యాత్ర ప్రారంభించిన నాటి నుంచే పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ విమర్శలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకానొక దశలో వారాహి అంటే పంది అంటూ విమర్శలు చేశారు. పవన్ ను అంతుచూసే దాక వదలమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీచేస్తామని పవన్ ప్రకటించేసరికి ఖుషీ అయ్యారు. తీరా వైసీపీ విముక్త ఏపీకి తప్పకుండా అందరం కలిసి సాగుతామని తెగేసి చెప్పేసరికి నానా హైరానా పడుతున్నారు. పవన్ పై విమర్శల జోరు పెంచారు. ఇటువంటి తరుణంలో మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.
వారాహి యాత్ర ప్రారంభం నుంచి సజ్జల నుంచి పోసాని కృష్ణమురళీ వరకూ..మాజీ మంత్రి పేర్ని నాని నుంచి మంత్రి ఆర్కే రోజా వరకూ పదుల సంఖ్యలో నేతలు గురిపెట్టారు. వరుసపెట్టి విమర్శలు చేశారు. మధ్యలో ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ ఎంటరయ్యారు. అందరిదీ ఒకటే బాణి.. ఒకటే టార్గెట్. పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడడమే. అయినా ఎక్కడా పవన్ వెనక్కి తగ్గలేదు. తన దూకుడు పరంపరను కొనసాగించారు. వైసీపీ నేతలకు కౌంటర్ గా కాపు సంఘ నేతలు, జన సైనికులు రెచ్చిపోయారు. దీటైన సమాధానాలు ఇచ్చారు.
పవన్ తనకు ఒకసారి చాన్స్ ఇవ్వాలని.. జనసేనకు మాత్రమే ఓటు వేయాలని అడిగినప్పుడు పొత్తు చిత్తు అయ్యిందని భావించారు. ఇక పొత్తు ఉండదనుకున్నారు. కానీ వారికి షాకిస్తూ పొత్తు ఉంటుందని పవన్ స్పష్టంగా చెప్పేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చేసరికి ఏంచేయాలో పాలుపోలేదు. అందుకే మంత్రులు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలకు దిగారు. రోజా అయితే శృతిమించి వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ పార్టీకి గుర్తే లేదని.. జిల్లా అధ్యక్షులు లేరని.. నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని.. అటువంటి వ్యక్తి జగన్ ను ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు.
అయితే ఈ నేపథ్యంలో మంత్రి పి.విశ్వరూప్ స్పందించారు. పవన్ సీఎం అవుతానంటే స్వాగతిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 175 సీట్లకు పోటీచేస్తే కదా సీఎం అయ్యేది అని ప్రశ్నించారు. 88 సీట్లు వస్తే కదా మెజార్టీ దక్కేది. కనీసం 50 సీట్లలోనైనా గెలిస్తే కదా సీఎం పోస్టుకు పోటీపడేది అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ సంతృప్తికర పాలన సాగిస్తున్నారని.. అటువంటప్పుడు ప్రజలకు పవన్ అవసరం లేదని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి జగనే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. అయితే మిగతా మంత్రులు, వైసీపీ నేతల కంటే మంత్రి విశ్వరూప్ ప్రకటన భిన్నంగా ఉంది. చర్చనీయాంశంగా మారుతోంది.