YS Sharmila: వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఆమెకు ఏమైనా లాభం ఉంటుందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కొని ఆమె కాంగ్రెస్ లో చేరితే పర్వాలేదు. కానీ అన్న జగన్ పై కోపంతో చేరితే మాత్రం అంతిమంగా నష్టపోయేది వైఎస్ కుటుంబమే. ఎంతో కొంత లబ్ధి పొందేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఈ పరిణామ క్రమంలో వైసిపి పరిస్థితి మైనస్ అవుతుంది. అది విపక్షాలకు ఎలాగూ ప్లస్ గా మారుతుంది.
ముందుగా తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని షర్మిల పరీక్షించుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అప్పట్లో ఆమె వెనుక జగన్ ఉన్నారని ప్రచారం జరిగింది. తన ఆప్త మిత్రుడు కేసీఆర్ను ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేసేందుకు జగన్ ఆ తరహా ప్రయత్నం చేశారని రాజకీయ ప్రత్యర్థులు అనుమానించారు. కానీ అదే కేసీఆర్ నుంచి షర్మిలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు జగన్ పట్టించుకోలేదు. దీంతో ఆమె బిజెపి కోసం పనిచేస్తున్నారని కొత్త ప్రచారం అందుకున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఆమె చర్యలు ఉన్నాయి. జగన్ వ్యతిరేక మీడియా ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ఆమె వెనుక ఎల్లో మీడియా ఉందని తేలింది. అయితే ఆమె కంప్లీట్గా ట్రాప్ లో ఉన్నారని.. ఎల్లో మీడియా ఆమెతో ఆడుకుంటుందన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ పరిణామ గ్రామంలో ఆమె తెలంగాణను విడిచి ఏపీ పై ఫోకస్ పెట్టనుండడం వెనుక కూడా ఎల్లో మీడియా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి అంశం ఆ మీడియాలో వెలుగు చూస్తుండడంతో ఇది నిజమని తేలింది.
తన రాజకీయ పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల సహకారాన్ని జగన్ తీసుకున్నారు. ముఖ్యంగా తన చెల్లి షర్మిల సేవలను వినియోగించుకున్నారు. అధికారంలోకి రాగలిగారు. అంతవరకే షర్మిలాను పరిమితం చేశారు. తమిళనాడు, తెలంగాణ తరహాలో మరో రాజకీయ కేంద్రం పార్టీలో ఉండకూడదని షర్మిలను నియంత్రించారు. కానీ అది షర్మిలకు రుచించలేదు. తన దారి తాను చూసుకున్నారు. అయినా సరే జగన్ ఏనాడూ షర్మిలపై ఎటువంటి విమర్శ చేయలేదు. కనీసం వ్యాఖ్యానించలేదు కూడా. అదే షర్మిల విషయానికి వచ్చేసరికి ఎల్లో మీడియా ట్రాప్ లో పడి ఆమె బ్లాస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నంత మాత్రాన షర్మిలకు ఒనగూరే ప్రత్యేక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అంటే లేవనే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయంలో షర్మిల కంటే కాంగ్రెస్ కి ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం అంతంత మాత్రమే. కనీసం నేతలను ఆదరించే శ్రేణులే కరువయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే జెండాలు పట్టేవారు లేకుండా పోయారు. ఇటువంటి తరుణంలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే చిన్నపాటి ఊపు రావడం ఖాయం. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి అసంతృప్త ఎమ్మెల్యేలు చేరడం ఖాయం. 2014, 2019 ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థితికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ షర్మిలకు ఎటువంటి ప్రయోజనం కలిగే ఛాన్స్ లేదు. పైగా వైసీపీ అభిమానులు ఆమెను శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంది. జగన్ ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మాత్రమే షర్మిలకు కాస్త ప్రయోజనం కనిపిస్తోంది. అన్నను దెబ్బ కొట్టాలన్న ఆశయం మాత్రమే తీరనుంది. అంతకుమించి ఆమెకు ప్రయోజనాలు ఏవి కనిపించడం లేదు. పోనీ రాజ్యసభ, అంతకంటే మించిన పదవి దక్కిన ఆమె ఉన్న పరిస్థితికి స్వల్ప ఊరటే. సో షర్మిల అడుగులు భవిష్యత్తులో ఆమెకు ఇబ్బంది కలిగించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.