Dr BS Rao : డాక్టర్ బీఎస్ రావు.. పరిచయం అక్కర్లేని పేరు. శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులుగా సుపరిచితులు. వృత్తిరీత్యా వైద్యుడే అయినా.. ప్రవృత్తిపరంగా విద్యావేత్త. వైద్యులుగా బీఎస్ రావు, ఝాన్సీ లక్ష్మీభాయి దంపతులు విశేష సేవలందించారు. విదేశాల్లో పేరుమోసిన డాక్టర్లుగా రాణించారు. కుమార్తెలను భారత్ లో చదివించాలన్న యోచనలతో వసతులున్న కాలేజీల కోసం ఆరాతీశారు. ఈ అన్వేషణలో భాగంగా పురుడుబోసుకున్నవే చైతన్య విద్యాసంస్థలు. 1986లో విజయవాడలో 86 మంది విద్యార్థినులతో బాలికా జూనియర్ కాలేజీ ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు అనతికాలంలోనే చైతన్య విద్యాసంస్థలు జాతీయ వ్యాపితమయ్యాయి. ప్రస్తుతం చైతన్య సంస్థల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
డాక్టర్ బీఎస్ రావుది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామం. సామాన్య రైతు కుటుంబం. ప్రాథమిక స్థాయి నుంచే బీఎస్ రావు చదువు అంటే ఆసక్తి. ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసిన అనంతరం విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ చదివారు. గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య కోర్సును పూర్తిచేశారు. ఎంబీబీఎస్ అనంతరం డాక్టర్ బీఎస్ రావుగా సుపరిచితులయ్యారు. లండన్ లో ఎంఆర్ హెచ్ఎస్ ను పూర్తిచేశారు. 1971లో డాక్టర్ ఝాన్సీ లక్ష్మీభాయిని వివాహం చేసుకున్నారు. ఇంగ్లండ్, ఇరాన్ లో 15 సంవత్సరాల పాటు దంపతులు వైద్యసేవలందించారు.
కుమార్తెలను భారత్ లో చదివించాలని సంకల్పించారు ఆ దంపతులు. విజయవాడలో వసతులున్న రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ కోసం అన్వేషించారు. ఆ సమయంలోనే మనమెందుకు అన్ని వసతులతో కూడిన కాలేజీ ఏర్పాటుచేయకూడదు అన్న ఆలోచన చేశారు. 1986లో 86 మంది బాలికలతో శ్రీచైతన్య రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీని ప్రారంభించారు. ఈ సంస్థ ప్రస్తుతం 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మొత్తం 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పదేళ్ల కిందటే చైతన్య విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతల నుంచి బీఎస్ రావు తప్పుకున్నారు. తన ఇద్దరు కుమార్తు సుష్మ, సీమకు అప్పగించారు.
తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలందించిన ఘనత డాక్టర్ బీఎస్ రావుకు దక్కుతుంది. కేవలం వాణిజ్యపరంగానే కాకుండా సేవారంగంలో కూడా ముందుండేవారు. 16 ఏళ్లకే మృతిచెందిన కుమారుడు కళ్యాణచక్రవర్తి స్మారకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను దత్తత తీసుకొని రక్షిత నీరు అందించారు. విపత్తుల సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇతోధికంగా సాయం ప్రకటించేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి అకాల మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. అన్నిరంగాల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Is there such a story behind the establishment of sri chaitanya educational institutions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com