Tammineni Sitaram: మాజీ స్పీకర్ తమ్మినేని ఇంట్లో రచ్చ నడుస్తోందా? ఆయన కుటుంబం జనసేనలో చేరనుందా?కుమారుడు, భార్య ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారా?వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని చెబుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆమదాలవలస నుంచి బరిలో దిగారు తమ్మినేని. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనపై గెలిచారు కూన రవికుమార్.స్వయానా తమ్మినేనికి మేనల్లుడు. కుటుంబ రాజకీయాలతోనే వైసీపీకి నష్టం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై నివేదికలు తెప్పించుకున్న జగన్ ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేనిని తప్పించారు. యువకుడైన చింతాడ రవికుమార్ కు అప్పగించారు. అప్పటినుంచి తమ్మినేని లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. కుమారుడు చిరంజీవికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావించిన తమ్మినేనికి ఇది షాకింగ్ విషయం. అయినా సరే వైసీపీలో కొనసాగుతూ వచ్చారు తమ్మినేని సీతారాం.
* టిడిపితో అనుబంధం
తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1999 వరకు వరుసగా ఐదు సార్లు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిసారి మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచి శాసనసభ స్పీకర్ అయ్యారు. ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. వైసీపీలో ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి మారిపోయింది. వాస్తవానికి ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు చిరంజీవిని బరిలో దించాలని తమ్మినేని చూశారు. కానీ అందుకు జగన్ అంగీకరించలేదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత.. నియోజకవర్గ బాధ్యతలు తన కుమారుడు చిరంజీవికి అప్పగించాలని కోరారు. అందుకు జగన్ అంగీకరించలేదు. కొత్త నేత చింతాడ రవికుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో వైసీపీలో ఉండడం వేస్ట్ అని సీతారాం కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
* జనసేన వైపు చూపు
జనసేనతోనే తన జర్నీ అన్నట్లు తమ్మినేని కుమారుడు చిరంజీవి చెబుతున్నారు. సీతారాం భార్య వాణి సైతం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో ఉండడం సేఫ్ కాదని చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి తమ్మినేని అంగీకరించడం లేదని తెలుస్తోంది. వైసీపీలో కొనసాగుదామని.. ఎన్నికల వరకు పరిస్థితి చూసి అడుగులు వేద్దామని ఆయన వారిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు కుమారుడితో పాటు భార్య ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో తమ్మినేని సైతం మెత్తబడ్డారని సమాచారం. కుటుంబానికి చెందిన అతి దగ్గర అనుచరులను పిలిపించుకుని దీనిపై చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో తమ్మినేని కుటుంబం పార్టీ మారడం పై ఫుల్ క్లారిటీ రానుంది. ఆ కుటుంబం జనసేనలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.