AP Elections 2024: ఫలితాల తర్వాత ఏపీలో పరిస్థితి దారుణమేనా?

ఏపీలో పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్రలు రాళ్లతో దాడులు జరిగి ఆయా ప్రాంతాలు రక్తసిక్తంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. జనాలు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఫలితాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.

Written By: Dharma, Updated On : May 17, 2024 4:27 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా రాజకీయ హింస చెలరేగింది. పోలింగ్ నాడు ప్రారంభమైన హింస.. రెండు రోజుల తర్వాత కూడా కొనసాగింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు సినిమాల్లో చూడడం తప్ప.. నేరుగా చూడడం ఇదే తొలిసారి. దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. జాతీయస్థాయిలో ఏపీ పరువు పోయింది. కేంద్ర బలగాలు మొహరించాయి. ఫలితాలు వచ్చాక రెండు వారాలపాటు ఏపీలో ఈ బలగాలు కొనసాగనున్నాయి.

ఏపీలో పరిస్థితి చూసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్రలు రాళ్లతో దాడులు జరిగి ఆయా ప్రాంతాలు రక్తసిక్తంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాలు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. జనాలు ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఫలితాలు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఈ పరిస్థితికి ముమ్మాటికి పోలీస్ శాఖ తీరే కారణం. కొందరు అధికారులు ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులోత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగానే పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకొని ఉంటే హింస ఈ స్థాయిలో పెరిగి ఉండేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్.. రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు బీహార్ కు ఉన్న అపవాదు ఏపీకి విస్తరించే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ నాడు చెదురు మదురు ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ పోలింగ్ నాడే పరిస్థితి అదుపు తప్పింది. తరువాత రెండు రోజులపాటు అలానే కొనసాగింది. ఎలక్షన్ కమిషన్ కలుగజేసుకోవడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజులను తలుచుకుంటే రాష్ట్రం ఎలా మారబోతుందోనన్న ఆందోళన రెట్టింపు అవుతోంది. కచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏపీలో జరిగే నష్టానికి మూల్యం తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.