Nara Lokesh Revenge Politics: నారా లోకేష్ (Nara Lokesh) పగతో రగిలిపోతున్నారా? అందులో భాగమేనా వైసీపీ నేతలపై కేసులు? లోకేష్ రాజకీయ జీవితంలో మార్పులు వచ్చాయా? అయితే దానికి కారణం ఏంటి? ప్రతీకార రాజకీయాలు క్షేమమేనా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతలంతా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. అయితే చాలామంది సీనియర్లు హుందాగా నడుచుకున్నారు. వారి జోలికి మాత్రం కూటమి ప్రభుత్వం వెళ్లడం లేదు.
వరుస అరెస్టుల నేపథ్యంలో..
మద్యం కుంభకోణంలో( liquor scam) వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఎంపీ మిధున్ రెడ్డి తాజాగా అరెస్టయ్యారు. అంతకంటే ముందే వైసిపి హయాంలో సీఎంఓ అధికారిగా పనిచేసిన ధనంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారంతా అరెస్టు అయ్యారు. నెక్స్ట్ అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం నడుస్తోంది. అయితే ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది. కానీ ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు మాత్రం ఈ అరెస్టులను ఖండించడం లేదు. జాతీయస్థాయిలో ఎన్ డి ఏ ప్రత్యర్థి పార్టీ అయినా కాంగ్రెస్ మాత్రం ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న వేళ మంత్రి నారా లోకేష్ కీలక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇండియా టుడే ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
లోకేష్ లో స్పష్టమైన మార్పు..
ఈ ఇంటర్వ్యూలో లోకేష్ వ్యక్తిగత విషయాలతో పాటు ఆయన శైలిలో వచ్చిన మార్పుపై జర్నలిస్టు ప్రశ్నలు వేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాల గురించి ప్రస్తావించిన సమయంలో.. చంద్రబాబును( AP CM Chandrababu ) అక్రమ అరెస్టు చేసినప్పుడు కుటుంబమంతా బాధపడిందని గుర్తు చేసుకున్నారు. 52 రోజులపాటు ఆధారాలు లేని కేసుల్లో జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. కుటుంబంలో ఐదుగురు ఐదు చోట్ల ఉండి పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తన భార్య బ్రాహ్మణి రాజకీయాలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. అదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు లోకేష్. అందుకే తన రాజకీయ బాణిని మార్చుకున్నారని.. ముల్లును ముల్లుతోనే తీయాలన్నా ఫార్ములాతో ముందుకెళ్తున్నానని కూడా చెప్పుకొచ్చారు.
ఆ ఘటనతో మార్పు..
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనను అరెస్టు చేశారు. వేకువ జమున అరెస్టు చేసి రోడ్డు మార్గంలో విజయవాడ( Vijayawada) తీసుకొచ్చారు. కేసుల మీద కేసులు పెడుతూ జైల్లో పెట్టారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో తండ్రి కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లి గట్టి ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో లోకేష్ అరెస్టు కూడా జరుగుతుందని ప్రచారం నడిచింది. అయితే నాటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించింది చంద్రబాబు కుటుంబం. అయితే అప్పటివరకు రాజకీయాల విషయంలో ఒక కోణంలో ఆలోచించే లోకేష్.. అప్పటినుంచి తన శైలిని మార్చుకున్నారు. రెడ్ బుక్ ను తెరపైకి తెచ్చి ప్రత్యర్థులకు గట్టి సవాల్ పంపారు. ఇప్పుడు రాజకీయాల్లో బుక్ సంస్కృతికి లోకేష్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు అనడంలో అతిశయక్తి కాదు.