AP Elections 2024: ఏపీలో కాంగ్రెస్ గెలిచేది ఆ ఒక్క స్థానమేనా? దాని ప్రత్యేకత ఏంటంటే?

చీరాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు అక్కడ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2009లో మాజీ సీఎం రోశయ్య ప్రోత్సాహంతో తొలిసారిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు.

Written By: Dharma, Updated On : April 26, 2024 12:05 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. వైసిపి వర్సెస్ కూటమి అన్న రేంజ్ లో పరిస్థితి కొనసాగుతోంది. అటు సర్వేలు సైతం టఫ్ ఫైట్ తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం బరిలో దిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే యాక్టివ్ గా మారింది. బలమైన నాయకులను పోటీలో దించింది. ఈసారి గౌరవప్రదమైన ఓట్లతో పాటు సీట్లు సాధించాలని భావిస్తోంది. కానీ 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల అసెంబ్లీ స్థానం. షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానంలో సైతం ఆమె గట్టి పోటీ ఇస్తారని చెబుతున్నారు కానీ.. గెలుపు చాన్స్ లేనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చీరాల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చీరాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు అక్కడ మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2009లో మాజీ సీఎం రోశయ్య ప్రోత్సాహంతో తొలిసారిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఐదేళ్లపాటు టిడిపిలో కొనసాగారు.2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు వైసిపి టికెట్ ఇవ్వలేదు. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కు గట్టి పట్టు ఉంది. తనకంటూ ఒక ప్రత్యేక అనుచర గణం ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ కు జగన్ టికెట్ ఇచ్చారు. మరోవైపు టిడిపి సైతం ఓ విద్యా సంస్థల అధినేతకు టికెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా మారడంతో.. వైసీపీకి మైనస్ అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సైతం చాన్స్ ఉంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ వైసీపీ ఓట్లను ఎక్కువగా చీల్చితే.. తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఇలా ఎలా చూసుకున్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవప్రదమైన స్థానం చీరాల నియోజకవర్గం కల్పిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.