Reddy community – Jagan : రెడ్డి సామాజికవర్గం జగన్ కు దూరమవుతోందా? దూరం చేస్తున్నారా?

టీడీపీలో ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు యాక్టివయ్యారు. అదే సమయంలో వైసీపీలోని అదే సామాజికవర్గం నేతలు జగన్ కు దూరమవుతున్నారు. బాహటంగానే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 8, 2023 11:51 am
Follow us on

Reddy community – Jagan : ఏపీలో ఈక్వేషన్స్ మారుతున్నాయా? సొంత సామాజికవర్గం నేతలే జగన్ కు దూరమవుతుండడం దేనికి సంకేతం? వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఫిక్స్ అయిపోయారా? లేక జగన్ చర్యలు మింగుడుపడడం లేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో మొన్నటివరకూ నంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి నుంచి నేటి బాలినేని శ్రీనివాసరెడ్డి వరకూ అందరూ జగన్ కు కట్టుబానిసలే. కానీ ఇప్పుడు పట్టుకోలేనంత దూరమయ్యారు. దూరమవుతున్నట్టు సంకేతాలిచ్చారు. జగన్ కు ఎదురుతిరిగిన నేతల్లో అందరూ రెడ్డి సామాజికవర్గం వారు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది.

ధిక్కార స్వరాలు..
టీడీపీలో ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు యాక్టివయ్యారు. అదే సమయంలో వైసీపీలోని అదే సామాజికవర్గం నేతలు జగన్ కు దూరమవుతున్నారు. బాహటంగానే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. తొలుత ఆనం రామనారాయణరెడ్డి, తరువాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే ఇలా అందరు రెడ్లు ఒకేసారి కూడబలుక్కొని ఎదురుతిరుగుతుండడం జగన్ కు కలవరపాటుకు గురిచేస్తోంది.

గెలుపు కోసం శ్రమిస్తే..
అయితే అది ధిక్కారం కాదని.. చాలారోజులు తమలో తాము దాచుకున్న వ్యధ అదని టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన వారే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల పాలనతో జగన్ పై ఏర్పడిన ప్రజావ్యతిరేకతతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదని ఫిక్స్ అయిన ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఇప్పటి నుంచే వేరే దారులు వెతుక్కుంటున్నారని టాక్. ఒక స్థిర నిర్ణయానికి వచ్చాకే ఒక్కొక్కరూ పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలో దారుణ పరాజయం ఎదురుకావడంతో రెడ్డి సామాజికవర్గం పునరాలోచనలో పడినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే నేతలు జాగ్రత్తలు పడుతున్నట్టు సమాచారం.

క్లోజ్ సర్కిల్ నుంచే అధికం..
రాజకీయంగా పదవులు దక్కలేదనో.. ఉన్న పదవులు తీశారనో అన్న వ్యధతో కొంతమంది ధిక్కార స్వరం వినిపించారని అనుకోవచ్చు. కానీ జగన్ క్లోజ్ సర్కిల్ నుంచి సైతం కొంతమంది బయటకు వెళుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలాంటి వాళ్లు జగన్ కు సన్నిహితులు. నావారు అనిపించుకున్న వారు. ఆ చనువుతోనే జగన్ పై ఈగవాలనిచ్చే వారు కాదు. ఈ జాబితాలోకి విజయసాయిరెడ్డి వస్తారు. ఆడిటర్ గా ఉన్నప్పుడే జగన్ కోసం పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చాక బంటుగా మారిపోయారు.ఆయన కోసం జైలుకు వెళ్లారు. ప్రత్యర్థులను తిట్టరానితిట్లు తిట్టారు. కేంద్ర పెద్దలకు వంగివంగి నమస్కారాలు చేశారు. భక్తి, వినమ్రత ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇంత చేశాక కూడా జగన్ కు ఇప్పుడు దూరంగా జరిగి ఎక్కడో ఢిల్లీలో గడుపుతున్నారు. అయితే మున్ముందు మరింత మంది సన్నిహితులు జగన్ కు ఎదురుతిరిగే చాన్స్ కనిపిస్తోంది.