Ganji Chiranjeevi: మంగళగిరి విషయంలో జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళగిరిలో లోకేష్ పట్టు బిగిస్తూ వచ్చారు. మరోవైపు రాజధాని ప్రాంతం కావడంతో వైసీపీ సర్కార్ పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. దీనిని సామాజికంగా ఎదుర్కోవాలని జగన్ భావించారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా లోకేష్ కు చెక్ చెప్పాలని భావించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు అదే గంజి చిరంజీవిని మార్చి లావణ్య అనే మహిళ అభ్యర్థిని ఇన్చార్జిగా ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. లోకేష్ ను ఓడించాలన్న లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలత చూపుతాయన్న భయం వైసీపీ శ్రేణుల్లో ఉంది.
గత రెండు ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉన్న లోకేష్ ను ఓడించారు. అయితే ఈసారి పరిస్థితి అలా ఉండదని జగన్ భావించారు. మంగళగిరి పై సర్వేలు కొనసాగించారు. అందులో లోకేష్ కు అనుకూలత కనిపిస్తోంది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పని చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి రప్పించి.. జగన్ బాధ్యతలు అప్పగించారు. అయితే చిరంజీవి సైతం వెనుకబడడం.. ఆయన సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగు హనుమంతరావు చిరంజీవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అది అసలుకే మోసం వస్తుందని తెలిసి జగన్.. కాండ్రు కమల కోడలు, హనుమంతరావు కుమార్తె అయిన లావణ్యను అభ్యర్థిగా ఎంపిక చేశారు.
అయితే ఇప్పుడు గంజి చిరంజీవి పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. పద్మశాలి సామాజిక వర్గంలో గంజి చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉంది. అటు తెలుగుదేశం పార్టీలో సైతం ఆయన సుదీర్ఘంగా పనిచేశారు. టిక్కెట్ ఇస్తామని చెప్పి ఆయనను పార్టీలోకి రప్పించారు. కానీ ఇన్చార్జి పదవి ఇచ్చినట్టే ఇచ్చి.. వెనక్కి లాక్కున్నారు. దీంతో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ తో మాట్లాడారని సమాచారం. చిరంజీవిగాని టిడిపిలో తిరిగి చేరితే అంతిమంగా వైసీపీకే నష్టం. అయితే అధినేత ఆలోచనసరికాదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డిని కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి జగన్ మదిలో ఇలాంటి ఆలోచన ఉందో చూడాలి.