Chintamaneni Prabhakar: చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar) పై చంద్రబాబు సీరియస్ అయ్యారా? అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ తిట్ల దండకం పై ఆగ్రహం వ్యక్తం చేశారా? నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రెండు రోజుల కిందట ఓ పెళ్లి వేడుకలో జరిగిన రభస పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అదే వివాహానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. అయితే అబ్బాయి చౌదరి కారు అడ్డంగా పెట్టడంపై చింతమనేని ప్రభాకర్ సీరియస్ అయ్యారు. డ్రైవర్ పై చిందులేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అటు తర్వాత ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు చింతమనేని. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పూర్వాపరాల కంటే.. చింతమనేని ప్రభాకర్ తిట్ల దండకం ఎక్కువగా వైరల్ అంశంగా మారింది.
* సీఎం కార్యాలయానికి చింతమనేని
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు( Chandrababu) పిలిపించుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులు చంద్రబాబుకు చింతమనేని వివరించినట్లు తెలుస్తోంది. అయితే తప్పు ఎత్తిచూపే కార్యక్రమం ఇది కాదని.. బూతు పదాలు వాడడం పద్ధతి కాదని చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు ప్రచారం నడుస్తోంది. వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికినట్లు సమాచారం. చింతమనేని ఈ విషయంలో తన వాదన వినిపించినప్పటికీ చంద్రబాబు మాత్రం.. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
* అప్పట్లో అదో వివాదం
2014లో టిడిపి( Telugu Desam) అధికారంలో ఉన్న సమయంలో దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ ఉండేవారు. అప్పట్లో ఇసుక వివాదానికి సంబంధించి ఆయన దూకుడు ప్రదర్శించారు. అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. ఓ మహిళా తహసిల్దార్ ను అప్పట్లో జుత్తు పట్టుకొని ఈడ్చారు అన్నది చింతమనేని ప్రభాకర్ పై వచ్చిన ఆరోపణ. అప్పట్లో దీనిపై టిడిపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రత్యర్థులకు ప్రచార అస్త్రం అయింది. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు ముందే మేల్కొన్నట్లు సమాచారం. దీనిపై చింతమనేని ప్రభాకర్ కు క్లాస్ తీసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది.
* ఆ ట్రాప్ లో పడను
అయితే చింతమనేని ప్రభాకర్ ( Chintamaneni Prabhakar)తన వాదనను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. దెందులూరు లో తనను ఇరికించే ప్రయత్నంలో అబ్బాయి చౌదరి ఉన్నారని.. కానీ ఆయన ట్రాప్ లో తాను పడనని.. తనకు పదవి అంటే వ్యామోహం లేదని.. అవసరం అనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. తన విషయంలో అంబటి రాంబాబు రంకెలు వేయడం ఏంటని ప్రశ్నించారు. గంటా అరగంట.. సుకన్య, సౌజన్య అంటూ ఎద్దేవా చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు వేస్తానని కూడా హెచ్చరించారు. మొత్తానికి అయితే చింతమనేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు సీరియస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.