BJP TDP Alliance: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి సిద్ధపడిందా? హై కమాండ్ పై ఒత్తిడి పెరుగుతోందా? పొత్తు కావాలనే బిజెపి నాయకులు పెరుగుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు టిడిపి రూట్లోకి బిజెపి రావడం ఖాయం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బిజెపి అడుగులు వేయ నున్నట్లు తెలుస్తోంది.దాదాపు టిడిపి, జనసేనతో ముందుకెళ్లాలన్న ఆలోచనతో బిజెపి ఉన్నట్టు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి కారణంగానే బిజెపి మనసు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ తప్పిదానికి పాల్పడిందని.. ఆ పార్టీతో ఎలా కలిసి నడుస్తామని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో సైతం బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి టిడిపి ముందుకు వచ్చిందని.. కానీ కలుపుకొని వెళ్లేందుకు బిజెపి సిద్ధపడలేదని.. అందులో తెలుగుదేశం పార్టీ తప్పు ఏముంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ రాష్ట్రం వ్యూహం ఆ రాష్ట్రానికి ఉన్నప్పుడు దీనిని పట్టించుకునే పరిస్థితి ఉండకూడదని కొంతమంది బిజెపి నాయకులు తేల్చి చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపికి ఎంపీ సీట్లు కీలకం. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు బిజెపికి వచ్చే అవకాశం లేదు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి ఆశాజనకంగా లేదు. కేరళలో ఒక్క సీటు కూడా సాధించే పరిస్థితి లేదు. కర్ణాటకలో సైతం మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా పరిమిత సంఖ్యలో సీట్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది. అక్కడ కూడా బిజెపి నామ మాత్రమే.తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ సీట్లను నెగ్గుకు రావడం కష్టమే. అందుకే ఏపీలో పొత్తులో భాగంగా కొన్ని సీట్లు దక్కించుకోవచ్చని రాష్ట్ర బిజెపి నేతల్లో మెజారిటీ వర్గం అధిష్టానాన్ని ఒప్పిస్తోంది.
ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మరోలా ఉంది. తెలుగుదేశం పార్టీకి బిజెపి 10 ఎంపీ సీట్లు, 15 ఎమ్మెల్యే సీట్లు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ టిడిపి మాత్రం ఐదు ఎంపీ సీట్లు, ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో బిజెపితో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు. రెండు పార్టీల శ్రేణులకు ఒప్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఢిల్లీలో ఈ తరహా ప్రకటనలు వస్తుండడంతో బిజెపి తప్పకుండా కూటమిలో చేరుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.