IPAC Survey: ఐప్యాక్ మూడో సర్వే లీక్ అయ్యిందా? అందులో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయా? సోషల్ మీడియాలో ఇదే విషయం తెగ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేపట్టిన మూడో సర్వే అంటూ హల్ చల్ చేస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ రాజకీయాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీం జగన్ కు పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ బృందం ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఆ సర్వేకు సంబంధించి ఫలితాలు బయటకు లీక్ అయ్యాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొలది సర్వేలు బయటకు వస్తున్నాయి. గత ఏడాదిగా నేషనల్ సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం వైసీపీకి ఫలితాలు ఇచ్చాయి.అటు ఏపీ సీఎం జగన్ సైతం ఎప్పటికప్పుడుసర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఐప్యాక్ సంస్థ ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా జగన్ ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఐప్యాక్ మూడో సర్వే ఫలితాలు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఐప్యాక్ సర్వే ఫలితాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మొదటి సర్వే 2023 ఆగస్టులో లీక్ చేశారు. ఆ సర్వేలో వైసీపీకి 35 నుంచి 50 సీట్లకు మించి రావని చెప్పారు. 2023 నవంబర్ నెలలో రెండో సర్వేను లీక్ చేశారు. ఆ సర్వేలో వైసీపీకి 31 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చారు. రెండు రోజుల కిందట మూడో సర్వే పేరిట ఫలితాలు లీక్ చేశారు. ఈ సర్వేలో టిడిపి జనసేన కూటమికి 144 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చారు.
శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు గాను టిడిపి, జనసేన కూటమికి 9, వైసీపీకి ఒకటి, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు గాను టిడిపి,జనసేనకు ఆరు, వైసీపీకి మూడు, విశాఖ జిల్లాలో 15 స్థానాలకు గాను టిడిపి,జనసేనకు 13, వైసీపీకి రెండు వస్తాయని సర్వే తేల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలకు గాను టిడిపి, జనసేన 17, వైసిపికి రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 14, వైసీపీకి ఒకటి, కృష్ణాజిల్లాలో 16 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 14, వైసీపీకి రెండు, గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 16, వైసీపీకి ఒకటి, ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 10, వైసీపీకి రెండు, నెల్లూరు జిల్లాలో పది స్థానాలకు టిడిపి, జనసేనకు 7, వైసీపీకి మూడు, చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 10, వైసీపీకి 4, కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 10, వైసీపీకి 4, అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు గాను టిడిపి,జనసేన 12, వైసిపికి 2, కడపలో పది స్థానాలకు గాను టిడిపి, జనసేనకు 5, వైసీపీకి 5 స్థానాలు వస్తాయని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో కూడా ఐప్యాక్ సర్వే అంటూ రకరకాల ప్రచారం జరిగింది. అప్పట్లో తాము ఎటువంటి సర్వేలు చేయలేదని ఐప్యాక్ సంస్థ ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే గత రెండు రోజులుగా ఐప్యాక్ సర్వే అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఐ ప్యాక్ సర్వే ఫలితాలు వెల్లడి కావడం విశేషం. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్న దానిపై ఐప్యాక్ సంస్థ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.