CM Ramesh VS Adinarayana Reddy: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. అయితే అక్కడక్కడ కూటమి పార్టీల నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో నేతల మధ్య సయోధ్య లేదు. అది జగన్ సొంత జిల్లా. ఎన్నికల్లో కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. పది అసెంబ్లీ సీట్లకు గాను కూటమి ఏడింట విజయం సాధించింది. కానీ జిల్లాలో కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మూడు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. మొన్నటి వరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ ఎంపీ సీఎం రమేష్ అన్నట్టు పరిస్థితి మారింది. ఇద్దరూ రచ్చకెక్కడంతో కూటమి ఇబ్బంది పడుతోంది. అయితే ఇద్దరు నేతలు బిజెపి వారే అయినా.. చంద్రబాబుకు సన్నిహితులు కావడం విశేషం.
* తొలుత బూడిద రాజకీయం
తొలుత రాయలసీమలో( Rayalaseema ) బూడిద రాజకీయం నడిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్లడంతో ఆదినారాయణ రెడ్డి తో పాటు జెసి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు సముదాయించారు. వివాదం తాత్కాలికంగా ముగిసింది. ఇంకోవైపు పులివెందులలో బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నట్టు ఉంది. వారి మధ్య విభేదాలు దాడులు వరకు వెళ్లాయి. బీటెక్ రవి అనుచరులు ఎమ్మెల్సీ మద్దతుదారులను నిర్బంధించడం వరకు పరిస్థితి వెళ్ళింది. ఒకరిపై ఒకరు నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదులు చేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాల పర్వం పతాక స్థాయికి చేరింది. వర్గ పోరుకు సైతం దారితీస్తోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో పాటు బహిరంగ విమర్శలు కూడా చేసుకుంటున్నారు.
* చాలా రోజులుగా విభేదాలు
అయితే ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఈనాటిది కాదు. సీఎం రమేష్( CM Ramesh) టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. ఆదినారాయణ రెడ్డి( AadiNarayana Reddy) వైయస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ ఇద్దరి మధ్య అప్పటినుంచి పోరు నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది. తాజాగా సీఎం రమేష్ కుటుంబానికి చెందిన వర్గానికి మద్యం దుకాణాలు లాటరీలో వచ్చాయి. అయితే అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరుగు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఇంకోవైపు సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మనుషులపై ఏకంగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
* ఆ ప్లాంట్ విషయంలో కొండాపురం( kondapuram) మండలంలో అదాని సంస్థకు దక్కిన పంప్డు స్టోరేజీ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. అయితే అక్కడ ప్లాంట్ పనులను ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డుకుంది. అయితే దీనిపై స్పందించిన సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి అనుచరుడు రిపబ్లిక్ క్లబ్ పేరుతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ క్లబ్ ముగించేశారు అధికారులు. దీనిపై ఆదినారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బిజెపి హై కమాండ్ కు కూడా ఫిర్యాదు చేశారు. బిజెపి అధిష్టానం ఇద్దరు నేతలపై ఆగ్రహంతో ఉంది. మరోవైపు రాయలసీమలో టిడిపి కూటమికి ఆధిపత్యం దక్కిందనుకున్న తరుణంలో విభేదాలు హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ సన్నిహితులే కావడంతో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.