Minister Vangalapudi Anitha: మొన్న ఉపాధ్యాయురాలు.. నిన్న ఎమ్మెల్యే.. నేడు హోం మంత్రి.. వంగలపూడి అనిత ప్రస్థానం ఇది. పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత రెండోసారి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా ఎంపికయ్యారు. ఈరోజు ఏకంగా హోం శాఖను సొంతం చేసుకున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిన శాఖను దక్కించుకున్నారు అనిత. ఉపాధ్యాయురాలుగా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పాయకరావుపేట నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె.. ఈసారి రికార్డ్ మెజారిటీతో గెలిచి హోం శాఖను దక్కించుకోవడం విశేషం.
అనిత ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఆమెకు ఛాన్స్ దక్కింది. పాయకరావుపేట నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. అనిత ఉపాధ్యాయురాలుగా పనిచేయడం కలిసి వచ్చిన అంశం. ప్రతి విషయంపైనా సమగ్రమైన అవగాహన ఉండటం.. వాగ్ధాటి, సూటిగా మాట్లాడడంలో దిట్ట. ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా వెనుకడుగు వేయరు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయితే అనితకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు .. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేశారు.ఎస్సీ మహిళగా ఉన్న అనిత పై.. వైసిపి ప్రభుత్వం విచిత్రంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. వైసిపి ప్రభుత్వం పై గట్టిగానే పోరాడారు. పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు.
ఈ ఎన్నికల్లో రెండోసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి అనిత గెలిచారు.మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా.. చంద్రబాబు మాత్రం అనిత సేవలను గుర్తించారు. క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రి పదవి ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా హోం శాఖను కట్టబెట్టారు. దీంతో సముచిత స్థానం లభించినట్లు అయ్యింది. టిడిపిలో సీనియర్లకు దక్కాల్సిన హోం శాఖను అనిత కైవసం చేసుకోవడం అభినందనీయం. అయితే వైసీపీ ప్రభుత్వంలో సైతం తొలుత ఎస్సీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత హోం మంత్రి పదవి దక్కించుకున్నారు. విస్తరణలో భాగంగా దానేటి వనితకు ఆ పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో వంగలపూడి అనితకు ఆ చాన్స్ దక్కింది. అయితే ఈ ముగ్గురు మహిళలు ఎస్సీ వర్గానికి చెందడం విశేషం.