New Liquer policy : ఏపీలో నూతన మద్యం పాలసీ అమలుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కొత్త మద్యం దుకాణాల నోటిఫికేషన్ కు రంగం సిద్ధమైంది. దీనిపై ఎక్సైజ్ శాఖ తొలి కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల కోటాలో షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై ప్రత్యేక ఆలోచన చేస్తోంది. కళ్ళు గీత వృత్తి కులాల జనాభా అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకుంటోంది. ఇప్పటికే లైసెన్స్ ఫీజు పై ఒక నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.ప్రస్తుతం అవే నడుస్తున్నాయి. ఈనెల 30తో వాటి గడువు ముగియనుంది. అందుకే ఇప్పుడు కొత్తగా మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులను కల్లుగీత వృత్తిదారులకు కేటాయించనుంది.
* ప్రైవేటు మద్యం దుకాణాలు
గతం మాదిరిగా ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని డిసైడ్ అయ్యింది. ఈ నూతన విధానం రెండేళ్ల కాల పరిమితి ఉండేలా నిర్ణయించారు. దీని ద్వారా రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. క్వార్టర్ మద్యం ధరను కనిష్టంగా 99 రూపాయలు ఉండాలని నిర్ణయించారు.
* ఐదేళ్లుగా నాసిరకం బ్రాండ్లు
గత ఐదేళ్లుగా వైసీపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు ఎక్కువగా కనిపించాయి. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో దర్శనమిచ్చేవి.ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాల్లో పాపులర్ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ లిక్కర్ షాపులతోపాటు ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వం.
* అక్కడికక్కడే బీరు తయారు చేసే బ్రూవరీలు
రాష్ట్రవ్యాప్తంగా 12 ఎలైట్ షాపుల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. లైసెన్సీలు వారి షాపులు పక్కనే వాకింగ్ స్టోర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం అదనంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. డ్రాట్ బీరు తయారు చేసి విక్రయించే మైక్రో బ్రూవరీలకు మళ్లీ అనుమతి ఇవ్వనున్నారు. అక్కడికక్కడే బీర్లు తయారు చేసి ఇవ్వనున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలో ఈ విధానం అమలవుతోంది. వివిధ రాష్ట్రాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి నూతన మద్యం పాలసీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.