https://oktelugu.com/

Pawan Kalyan – East Kapus : పవన్ కళ్యాణ్ విషయంలో తూర్పు కాపుల సంచలన నిర్ణయం..

మొత్తానికైతే పవన్ తూర్పుకాపుల భవిత గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగడంపై  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటికి తూర్పుకాపులు జనసేన వైపు టర్న్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 29, 2023 / 12:09 PM IST
    Follow us on

    Pawan Kalyan – East Kapus : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తూర్పుకాలపులది ప్రత్యేక స్థానం. రాజకీయాలను శాసించగల సామర్థ్యం ఆ సామాజికవర్గం సొంతం. కానీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు.. ఆ సామాజికవర్గం నుంచి గెలుస్తున్న నాయకులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సామాజికవర్గానికి రాజకీయంగా పెద్దపీట వేస్తోంది. కానీ సామాజికవర్గం జీవన స్థితిగతులు మాత్రం మారడంలేదు. దీనికి ప్రధాన లోపం నాయకుల్లో చిత్తశుద్ధి కొరవడడం. ఇదే విషయాన్ని గుర్తించారు పవన్ కళ్యాణ్. ఇటీవల తూర్పుకాపు ప్రతినిధులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. లోతైన విశ్లేషణ చేశారు. జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

    తూర్పుకాపుల గురించి పవన్ ప్రస్తావించిన ప్రతీ అంశం ఆలోచింపజేసింది. ఉత్తరాంధ్ర తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువ అని.. దేశంలో ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ తూర్పుకాపులు ఉంటారని గుర్తుచేశారు. శ్రీకాకుళంలో వంశధార రిజర్వాయర్ కు సర్వం త్యాగం చేసిన వారు తూర్పుకాపులేనని గుర్తుచేశారు. ఏడాది పొడవునా పంటలు పండే పంచరత్న గ్రామాల్లో నివాసముండేది తూర్పుకాపులేనన్నారు. కనీసం ఎండ జాడ కనిపించని పచ్చని చెట్ల నీడలో ఉండే ఆ గ్రామాల ప్రజలు జిల్లాను సస్యశ్యామలం చేసే వంశధార ప్రాజెక్టు కోసం తమ ఆస్తులను తృణప్రాయంగా విడిచిపెట్టారని గుర్తుచేశారు. అటువంటి తూర్పుకాపులు నేడు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు దాటితే తూర్పు కాపులకు బీసీ ధ్రువీకరణ పత్రం ఇవ్వరని..కేవలం ఆ మూడు జిల్లాల్లోనే వారికి బీసీ కార్డు పనికొస్తుందని అన్నారు. తెలంగాణకు వెళ్తే అసలు వారిని బీసీలుగానే గుర్తించరని చెప్పారు.తూర్పు కాపులు మొత్తం 46 లక్షల మంది ఉన్నారని కుల సంఘాల నాయకులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో వారిని 26 లక్షలుగా గుర్తిస్తే.. వైసీపీ వారిని కేవలం 16 లక్షలే అని లెక్కలు చెబుతోందని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక తూర్పు కాపుల లెక్కలు తేలుస్తామని.. అలాగే వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

    ఉత్తరాంధ్రలో తూర్పుకాపుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఏ రోజు సొంత సామాజికవర్గం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ సాహసం కూడా ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమ్ పవన్ ప్రస్తావించేసరికి తూర్పుకాపు ప్రతినిధుల కళ్లు చెమ్మగిల్లాయి. తమ సామాజికవర్గం గురించి ఇంత లోతైన విశ్లేషణ చేసిన నాయకుడు లేడని స్వయంగా అక్కడికి హాజరైన ప్రతినిధులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికైతే పవన్ తూర్పుకాపుల భవిత గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగడంపై  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటికి తూర్పుకాపులు జనసేన వైపు టర్న్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది.