Graduate MLC Elections : వైసీపీకి అరుదైన ఛాన్స్.. అదే జరిగితే జగన్ కు తిరుగులేదు

ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరోవైపు వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇటువంటి సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. అవి గెలిస్తే మాత్రం ఆ పార్టీకి జవసత్వాలు నింపే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : October 23, 2024 12:40 pm

Graduate MLC Elections

Follow us on

Graduate MLC Elections : నాలుగు నెలల చంద్రబాబు పాలన వైఫల్యం చెందిందని జగన్ ఆరోపిస్తున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ప్రజలు తిరిగి వైసిపి పాలన కోరుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. ఏ వర్గము సంతృప్తిగా లేదని.. పాలనలో చంద్రబాబు వైఫల్యం చెందారని.. మళ్లీ గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు పాపాలు నాలుగు నెలల్లోనే పండాయని కూడా శాపనార్ధాలు పెడుతున్నారు. ఇటువంటి సమయంలో జగన్ కు ఒక అరుదైన చాన్స్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక అవకాశం వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. దీనిని రెఫరండంగా తీసుకొని ప్రజల్లోకి వెళితే కచ్చితంగా వైసీపీకి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే వైసిపి గెలిస్తేనే జగన్ ఆరోపణలు నిజం ఉన్నట్టు. లేకుంటే మాత్రం అవన్నీ రాజకీయ ఆరోపణలేనని తేలిపోతుంది.ఉమ్మడి కృష్ణా- గుంటూరు తో పాటు ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయడం, గెలిచి చూపిస్తే మాత్రం జగన్ మరోసారి తిరుగులేని రాజకీయ శక్తిగా మారనున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి నుంచే జగన్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వైసీపీకి అటువంటి చాన్స్ వచ్చింది. జగన్ చెబుతున్నట్టు నాలుగు మాసాల్లో చంద్రబాబు పాలన వైఫల్యం చెందితే ప్రజలు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

* టిడిపి అభ్యర్థులు ఖరారు
ఇప్పటికే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజాను అభ్యర్థిగా ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి సైతం దాదాపు అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే జగన్ సైతం గౌతమ్ రెడ్డి అనే నేతను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వైసీపీకి ఒక అవకాశం గా మారింది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే కచ్చితంగా విద్యాధికులు స్పందిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ప్రభుత్వం ఎన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినా.. పట్టభద్రుల తీర్పు మాత్రం విలక్షణంగా ఉంటుంది. గత మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దీనికి ఉదాహరణ.

* ఆ సమస్యలకు చెక్
ప్రస్తుతం వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ పార్టీకి విజయం దక్కితే ఇబ్బందికర పరిస్థితులను కొంతవరకు అధిగమించవచ్చు. పైగా చంద్రబాబు నాలుగు నెలల పాలన వైఫల్యం గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. పార్టీ పుంజుకుంటుందన్న సంకేతాలను పంపించవచ్చు. వైసిపి పని అయిపోయిందన్న కామెంట్స్ కు చెక్ చెప్పవచ్చు. ఇన్ని ప్రయోజనాలు వైసీపీకి ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పాల్గొని.. విజయం సాధించే అవకాశం ఉందా? లేదా? అనేది పార్టీ పరిశీలించుకోవాలి. ఒకవేళ పార్టీకి ఓటమి ఎదురైతే మాత్రం.. మరిన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టే.