Botsa Satyanarayana: బొత్స కు దెబ్బేసిన శిష్యుడు

గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. పార్లమెంట్ స్థానం పరిధిలో నాలుగు నగర నియోజకవర్గాల్లో టిడిపి గెలుపొందింది.గాజువాక,భీమిలి,ఎస్. కోటల్లో మాత్రం వైసిపి గెలిచింది.

Written By: Dharma, Updated On : March 7, 2024 12:57 pm

Botsa Satyanarayana

Follow us on

Botsa Satyanarayana: తన సతీమణి గెలుపునకు బొత్స సత్యనారాయణ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బొత్స పై నమ్మకంతోనే జగన్ ఆయన భార్య ఝాన్సీ లక్ష్మికి విశాఖ ఎంపీ స్థానాన్ని కట్టబెట్టారు. అయితే అక్కడ గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో టిడిపి, జనసేన బలంగా ఉన్నాయి. పైగా విశాఖ పార్లమెంట్ స్థానం ఎక్కువగా నగరంలోనే విస్తరించి ఉంది. నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాలు ఈ ఎంపీ స్థానంలో ఉన్నాయి. భీమిలిలో కొంత భాగం, ఎస్.కోట నియోజకవర్గంగ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వచ్చే ఓట్ల ద్వారా గట్టెక్కాలని వైసిపి భావిస్తోంది. కానీ అక్కడే వైసీపీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. బొత్స సత్యనారాయణ అనుచరులే దెబ్బ కొడుతుండడంతో ఎంపీ స్థానంలో గెలుపు కష్టతరంగా మారుతోంది.

గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. పార్లమెంట్ స్థానం పరిధిలో నాలుగు నగర నియోజకవర్గాల్లో టిడిపి గెలుపొందింది.గాజువాక,భీమిలి,ఎస్. కోటల్లో మాత్రం వైసిపి గెలిచింది. టిడిపి గెలుపొందిన ఆ నాలుగు నియోజకవర్గాల్లో మెజారిటీ తక్కువ రాగా.. గాజువాక, భీమిలి, ఎస్. కోట నియోజకవర్గంలో వైసీపీకి భారీ మెజారిటీ దక్కింది. ఎంపీ స్థానం గెలుపొందేందుకు ఆ మూడు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ దోహద పడింది. ఇప్పుడు కూడా అదే అంచనాతో బొత్స తన సతీమణిని ఎంపీగా బరిలోకి దించారు. కానీ రూరల్ నియోజకవర్గం లో పరిస్థితి దిగజారుతుండడంతో ఆందోళన నెలకొంది.

ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి సుధారాణి పార్టీని వీడడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ రఘురాజు భంగపడ్డారు. అందుకే ఆయన భార్యను టిడిపిలోకి పంపించారు. రఘురాజు బొత్సకు ప్రధాన అనుచరుడు. 2009 ఎన్నికల్లో ఎస్ కోట టికెట్ను ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి 31 వేల ఓట్లు సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 30 వేల ఓట్లు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినగా.. అత్యధిక ఓట్లు దక్కించుకున్న జాబితాలో బొత్స సత్యనారాయణ మొదటి వారు కాగా.. రఘురాజు మూడో వ్యక్తి. అందుకే తాను వైసీపీలోకి వెళ్ళినప్పుడు రఘురాజును సైతం బొత్స తీసుకెళ్లారు.

2019 ఎన్నికల్లో ఎస్ కోట నియోజకవర్గం వైసీపీ టికెట్ ను రఘురాజు ఆశించారు. కానీ టికెట్ అనూహ్యంగా కడుబండి శ్రీనివాసరావుకు దక్కింది. నేరుగా జగన్ ఆదేశించేసరికి రఘురాజు కడుబండి కోసం కష్టపడ్డారు. కడుబండి శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన భార్యకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ను రఘురాజు ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. కడుబండి శ్రీనివాసరావుకు ఖరారు చేశారు. దీంతో రఘురాజు పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ఆయన భార్యకు టిడిపిలోకి పంపించారు. ఒకవేళ రఘురాజు కానీ టిడిపిలో చేరితే బొత్స సత్యనారాయణఆశలు గల్లంతైనట్టే. ఎస్ కోట నియోజకవర్గంలో వచ్చే మెజారిటీతో విశాఖ ఎంపీగా గెలుస్తామని బొత్స ఆశలు పెట్టుకున్నారు. కానీ అంత ఈజీ కానట్టు తాజా పరిస్థితి తెలియజేస్తోంది. దీంతో బొత్స కలవర పడుతున్నట్లు సమాచారం.