Krishna Teja impresses CBN: ఏపీ సీఎం చంద్రబాబులో( AP CM Chandrababu) ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా అంశంపై ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇట్టే స్వీకరిస్తారు. అందులో మంచి పని ఉంటే మాత్రం ప్రశంసిస్తారు. ఇప్పుడు తాజాగా అమరావతి లో జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా అటువంటి ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగు చూసింది. రెండు రోజులపాటు అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. రెండో రోజు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష జరిగింది. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ నడిచింది. పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల మాదిరిగా..
సాధారణంగా నగరాల పరిధిలో ఉండే పట్టణాలు, ప్రధాన మేజర్ పంచాయతీలను కలుపుతూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు( Urban Development authorities ) ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే చాలా వరకు పట్టణాలు, గ్రామాలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు లేవు. దీంతో కొన్ని రకాల ప్రణాళికకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే విషయంపై కలెక్టర్ల సదస్సులో చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ త్వరలో మేజర్ పంచాయితీలలో కూడా కంట్రీ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఇలా చేస్తాం : పవన్
మరోవైపు ఇదే అంశంపై పంచాయితీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ( Panchayati Raj commissioner Krishna Teja) చేసిన ప్రతిపాదనలు అక్కడకక్కడే వినిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంచాయితీ గ్రేడింగ్లలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. మండల కేంద్రాలను గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఏ విధంగా సహకరిస్తుందో.. అలాగే ఒక వింగ్ పెట్టుకుని సాయం చేద్దామని ప్లాన్ చేసినట్లు పవన్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 250 వరకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆలోచన బాగుందని.. కాస్త మెరుగులు దిద్ది.. పట్టణాల మాదిరిగా రూర్బన్ మిషన్ విధానంలో అమలు చేద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇలా కొత్త కొత్త ఆలోచనలకు స్వాగతిస్తారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా ఓ ఐఏఎస్ అధికారి పెట్టిన ప్రతిపాదనను డిప్యూటీ సీఎం ప్రస్తావించడం.. దానికి సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేస్తూ అక్కడికక్కడే స్వాగతించడం విశేషం.