New GST policy: దేశంలో నూతన జీఎస్టీ( GST) విధానం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. సామాన్యులకు ఊరటనిచ్చేలా అనేక వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా రకాల వస్తువులను ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి రావడంతో వాటి ధర తగ్గనుంది. నూతన జీఎస్టీ విధానానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక బుక్ లెఫ్ట్ విడుదల చేశారు. ఇది పూర్తిగా తెలుగులోనే రూపొందించారు. మరోవైపు కొత్త జీఎస్టీ విధానం కారణంగా ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల రూపాయల వరకు ప్రయోజనం అని ఏపీ వాణిజ్య పనుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు తెలిపారు.
భారీగా ధరలు తగ్గుముఖం..
చాలా వస్తువులపై ప్రస్తుతం జీఎస్టీ 18% ఉంది. అది ఐదు శాతానికి తగ్గితే భారీగా ధరలు తగ్గుతాయని వాణిజ్య పనుల శాఖ( commercial tax department) అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వెన్న, నెయ్యి,పన్నీరు, సబ్బులు, షాంపూ, హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపై పన్ను తగ్గనుంది. ప్యాచ్రైజ్డ్ పాలు, పన్నీరు, బ్రెడ్ వంటి వాటికి జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వాటిపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించడంతో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం. స్వీట్లు,చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్ మీద కూడా పన్ను ఐదు శాతానికి తగ్గనుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ల పై జిఎస్టి 15% నుండి ఐదు శాతానికి తగ్గించారు.
చేనేత, హస్త కళాకారులకు ప్రయోజనం
ఇక ఏపీలో( Andhra Pradesh) ప్రత్యేకంగా జీఎస్టీ తగ్గింపుతో చాలా రంగాలకు ఉపయోగం ఉంది. ముఖ్యంగా చేనేత, హస్తకళలకు సంబంధించి జీఎస్టీ తగ్గింపుతో చాలా రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. మన రాష్ట్రంలో చేనేత రంగానికి సంబంధించి పొందూరు ఖాది, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి చేనేత వృత్తుల వారికి.. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలపై కూడా జీఎస్టీ తగ్గింపు ప్రభావం అధికంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎగుమతులు పెరిగేందుకు అవకాశం లభించనుంది. సేవ రంగం, హోటల్ వసతులపై జిఎస్టి తగ్గింపు వల్ల.. హోటల్ చార్జీలు కూడా తగ్గుతాయి. ఫలితంగా విశాఖ లాంటి పర్యాటక నగరంలో సామాన్యుడికి సైతం షెల్టర్ దక్కి అవకాశం ఉంది. ప్రజారోగ్యానికి సంబంధించి మందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లపై కూడా జీఎస్టీని తగ్గించడం మంచి నిర్ణయం. ఇది రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేలా ఉందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.