Sharmila Property: షర్మిల వారసత్వపు ఆస్తి ఎంత..? జగన్‌ ఇచ్చిన ఆస్తులెన్ని..?

షర్మిల, జగన్ మధ్య ఆస్తివ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. షర్మిల లేఖలు రాయడం, పంపకాల వ్యవహారం ఇదంతా కొనసాగుతోంది. అయితే వీరి వివాదాల నేపథ్యంలో వైసీపీ నేత పేర్ని నాని వీటి గురించి మాట్లాడారు.

Written By: Dharma, Updated On : October 26, 2024 2:36 pm

Sharmila Property

Follow us on

Sharmila Property: వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం.. వైఎస్ పెద్దాయన (రాజశేఖర్‌ రెడ్డి) బతికున్న సమయంలోనే జగన్‌కు, షర్మిలకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయని పేర్ని అన్నారు. ఆ తర్వాత తన స్వార్జితంలో నుంచి జగన్ కూడా కొంత ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఆస్తుల విషయంలో షర్మిల మార్పులు చేయడంతో వివాదం తలెత్తిందని పేర్ని తెలిపారు. అందుకే జగన్‌ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్ని చెప్పుకచ్చారు. షర్మిలకు తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల వివరాలు, అన్న జగన్‌ ఇచ్చిన ఆస్తి, ఏయే కంపెనీల్లో ఏఏ వాటాలు ఉన్నాయో పేర్ని చెప్పుకచ్చారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం.. వైఎస్‌ బతికి ఉండగానే షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల వ్యవసాయ పొలం, సండూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్, స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టులకు సంబంధించి లైసెన్సులు, స్వాతి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులో వాటా, విజయవాడ రాజ్‌ – యువరాజ్‌ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వాటాలు దక్కాయి.

ఇక జగన్ కష్టార్జితంగా సంపాదించుకున్నవి భారతి సిమెంట్స్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, మీడియా సంస్థలు. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌ ఆస్తుల్లో సైతం షర్మిలకు వాటా ఇచ్చారు జగన్. షర్మిల వివాహం జరిగిన ఇన్నేళ్లకు, వైఎస్ మరణించిన దశాబ్దం తర్వాత 2019లో తన స్వార్జిత ఆస్తిలో షర్మిలకు జగన్‌ వాటా ఇచ్చాడు. చెల్లితో పాటు తల్లిని కూర్చోబెట్టి మరీ తన అటాచ్ మెంట్ ఆస్తుల్లో వారికి వాటా ఇచ్చారు అని చెప్పారు పేర్ని.

ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించి కూడా జగన్‌ ఎంవోయూ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా పేర్ని వివరించారు. భారతి సిమెంట్స్‌లో 40 శాతం, మీడియా సంస్థలో 40 శాతం, సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌లో 100 శాతం వాటాలకు సంబంధించి ఎంవోయూ రాసుకున్నారు.

కోర్టు కేసులు అయిపోయాక తల్లికి, చెల్లికి ఈ ఆస్తులు ఇస్తానని శ్వేతపత్రంపై జగన్‌ తన అంగీకారం తెలిపారని, అది అన్‌ రిజిస్ట్రర్డ్ అంటూ తెలిపారు పేర్ని. షేర్‌ సర్టిఫికెట్లు పోయాయని కొత్త షేర్లను విజయలక్ష్మి పేరుపై మార్చి డైరెక్టర్లను షర్మిల మార్చేయడంతోనే వివాదం తలెత్తిందని చెప్పారు పేర్ని. చెల్లిపై జగన్‌కు ప్రేమ లేకపోతే ఆస్తులు రాసిస్తూ సంతకం పెడతారని పేర్ని ప్రశ్నించారు.