AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం పూర్తయింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 1102 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5960 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వీటిని ఈరోజు పరిశీలిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 30న పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ జరగనుంది.
ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు కూడా భారీగానే నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు ముందు జాగ్రత్త చర్యగా రెండు సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఈరోజు పరిశీలనలో డూప్లికేట్ నామినేషన్లను అధికారులు తిరస్కరించనున్నారు. అప్పుడే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున సీట్ల సర్దుబాటు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో రెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. వారిని నాయకత్వం బుజ్జగించింది. దీంతో వారంతా నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 30వ తేదీకి పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేస్తారు. అనంతరం ఈ పేర్లను ఈవీఎంలలో ప్రింటింగ్ కు పంపుతారు.
మరోవైపు నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీల అధినేతలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అటు కూటమి అధినేతలు ఒకే వేదిక పైకి వస్తున్నారు. కేవలం రెండు వారాల వ్యవధి ఉండడంతో మరింత దూకుడు పెంచుతున్నారు. మరోవైపు ఎండలు మండుతున్నాయి. పార్టీల శ్రేణులు ప్రచారానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఉదయం, సాయంత్రం వేళలకే ప్రచారం పరిమితమవుతోంది.