House Collapsed: ప్రస్తుతం అంతటా వినాయక చవితి( Vinayaka Chavithi) సందడి నడుస్తోంది. నిమజ్జనాలు సైతం ప్రారంభం అయ్యాయి. దీంతో డీజేల సందడి అంతా ఇంతా కాదు. పోలీసులు డీజే లపై ఆంక్షలు విధించిన ఎక్కడా వాటి జోరు తగ్గడం లేదు. ప్రతి చోటా కనిపిస్తూనే ఉన్నాయి. వారి శబ్దాలతో గ్రామాల్లో అలజడి కూడా ఉంటుంది. డీజేల కారణంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పక్కన ఉండే వారి మాట కూడా వినిపించడం లేదు. భారీ శబ్దాల వల్ల చెవిలోని కర్ణభేరీకి ప్రమాదం వాటిల్లుతోంది. వినికిడి శక్తి కోల్పోయిన వారు సైతం ఉన్నారు. అయినా సరే ఈ డీజేల మోత ఆగడం లేదు. ఏపీలో డీజే మోతకు ఓ ఇల్లు గుల్ల అయ్యింది. అందరూ చూస్తుండగానే కుప్ప కూలిపోయింది.
తృటిలో తప్పించుకున్న వృద్ధ దంపతులు..
నంద్యాల జిల్లా( Nandyala district ) కోవెలకుంట్లలో ఆదివారం వినాయక నిమజ్జనంలో ఒక అపశృతి చోటుచేసుకుంది. డీజే శబ్దాలకు ఒక మట్టి ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. సంతపేటలో వినాయక వేడుకలు నిర్వహించారు. ఆదివారం నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు డీజే లను ఏర్పాటు చేశారు. అయితే ఓ మట్టి ఇంట్లో నివాసం ఉంటున్నారు లక్ష్మయ్య, రత్నమ్మ అనే వృద్ధ దంపతులు. డీజే శబ్దం ఎక్కువ కావడంతో వారు పక్క గదికి వెళ్లిపోయారు. డీజే ధాటికి ఆ ఇల్లు కూలిపోయింది. స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదం భయానకంగా ఉంది. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
నిబంధనలు విధించినా
ఈ ఏడాది వినాయక నవరాత్రి వేడుకలకు నిబంధనలు తప్పనిసరి చేశారు ఏపీ పోలీసులు( AP Police Department). తప్పనిసరిగా మండపాలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో వినాయక నిమజ్జనంలో సైతం డీజే సౌండ్స్ వినిపించకూడదని ఆంక్షలు విధించారు. వాస్తవానికి డీజేలపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. సాధారణంగా నివాస ప్రాంతాల్లో శబ్దాలు 50 డేసిబిల్స్ వరకు ఉండవచ్చు. 55 డేసిబల్స్ పైన ఉంటే కనుక ప్రమాదం. అయితే ఈ డీజేలు మాత్రం 100 నుంచి 150 డిసిబిల్స్ వరకు శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారు మరింత ఇబ్బందులకు గురికావడం ఖాయం. అలాగే కర్ణభేరిపై కూడా ఈ శబ్దం ప్రభావం చూపుతుంది. మనిషి వినికిడి బలం తగ్గే అవకాశం కూడా ఉంది. డీజే ల పై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ కొందరు మాత్రం వినాయక నిమజ్జనాల్లో డీజే లను వినియోగిస్తూనే ఉన్నారు.