Honey Trap
Honey Trap: విశాఖ జిల్లాలో( Visakha district ) హనీ ట్రాప్ మరోసారి కలకలం సృష్టించింది. ఓ యువతి ఫోన్ తో ట్రాప్ లో పడిన ఓ యువకుడు నిలువు దోపిడీకి గురయ్యాడు. చేతిలో ఉన్న నగదు, బంగారం, ఏటీఎం కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుని వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తికి ఈ నెల 18న ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అదే పనిగా ఫోన్ చేస్తుండడంతో రామారావు మాట్లాడాడు. ఆ మరుసటి రోజు పెద్దిపాలెం వెళుతుండగా ఆ యువతీ మరోసారి ఫోన్ చేసింది. శ్రీకాకుళం జిల్లా సంకివలస వద్దకు రావాలని కోరింది. ఆమె చెప్పిన ప్రదేశానికి వచ్చిన వెంటనే గుర్తు తెలియని నలుగురు దుండగులు రామారావును కిడ్నాప్ చేశారు. దాకమర్రిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆయన వద్ద ఉన్న 48 వేల రూపాయల నగదు, ఏటీఎం కార్డులను దుండగులు తీసుకున్నారు. అయితే రామారావు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అయితే ఆయన అకౌంట్ నుంచి తాజాగా 7వేల రూపాయల నగదును డ్రా చేశారు. దీంతో నగదు మాయం పై బాధితుడు భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను ట్రాప్ లో ఎలా పడ్డానో పోలీసులకు వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లో ఓ మహిళ
మరోవైపు విశాఖలో హనీ ట్రాప్ లు( Honey traps ) పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల డిపిలు, వాయిస్ తో ఫోన్ చేసి ట్రాప్ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఇదే మాదిరిగా ఓ ఘటన చోటుచేసుకుంది. గత ఏడాది అక్టోబర్లో జాయ్ జమీనా అనే మహిళ ప్రేమ పెళ్లి స్నేహం ముసుగులో చాలామందిని ట్రాప్ చేసింది. విద్యాధికురాలు అయిన ఆమె తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో హనీ ట్రాప్ ను ఎంచుకుంది. ధనవంతుల పిల్లలను బురిడీ కొట్టించింది. ఫోన్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా దగ్గర చాలామంది వద్ద లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఆమె వెనుక ఒక ముఠా హస్తము ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. మత్తు కలిపిన డ్రింక్ తాగించి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు చిత్రీకరించేది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేది. అయితే అప్పట్లో నిఘ వేసిన విశాఖపట్నం పోలీసులు ఆమెను పట్టుకోగలిగారు.
* మూడు నెలల తరువాత
అయితే మూడు నెలల తరువాత తాజాగా ఈ హనీ ట్రాప్ జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై విశాఖ పోలీసులు( Visakha police ) అలెర్ట్ అయ్యారు. గతంలో హనీ ట్రాప్ నకు పాల్పడిన పాత నిందితులను ఆరా తీసే పనిలో పడ్డారు. ప్రధానంగా సోషల్ మీడియాను టార్గెట్ చేసుకొని.. ధనవంతులను లక్ష్యంగా చేసుకొని ఈ హనీ ట్రాప్ నకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాధి రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ దిశగా విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
* పెరుగుతున్న నేర సంస్కృతి
ఇటీవల విశాఖ నగరంలో( Visakha City ) మేర సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరం అభివృద్ధి చెందడంతో పాటు ఉత్తరాధి రాష్ట్రాల వారు ఎక్కువగా ఉద్యోగ,ఉపాధి నిమిత్తం నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ నేర సంస్కృతి పెరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. మత్తు పదార్థాల వినియోగం కూడా పెరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గంజాయి, హెరాయిన్ వంటి ప్రాణాంతక మత్తు పదార్థాలు సాగరనగరంలో చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేకంగా అప్రమత్తమయింది. హనీ ట్రాప్ పై విశాఖ పోలీసులు అవగాహన కార్యక్రమాలను పెంచుతున్నారు.