Pawan vs Anitha : పవన్ కళ్యాణ్ పరుష వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత.. సంచలన కామెంట్స్

ఏపీ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. నిన్నటిదాకా జగన్ - షర్మిల ఆస్తుల వివాదం, విజయమ్మ లేఖ, చంద్రబాబు విశాఖ పర్యటన.. రిషికొండలో నిర్మించిన ప్యాలస్ వ్యవహారం.. వంటి సంఘటనలు చర్చకు దారితీసాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 5, 2024 8:02 am

Pawan vs Anitha

Follow us on

Pawan vs Anitha : ఇటీవల ఏపీలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు సంచలనం రేపుతున్నాయి. సహజంగానే వీటిని వైసిపి.. కూటమి ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని వడమాల పేట మండలంలో మూడున్నర సంవత్సరాల బాలికపై హత్యాచారం జరగడం సంచలనం రేపింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని.. దారితప్పిన శాంతిభద్రతలకు నిదర్శనమని వైసిపి ఆరోపించడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ఘటనలో మృతురాలి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. స్వయంగా ఆ చెక్కును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అందజేశారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన వెంటనే పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడిని ఆ క్షణమే అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఆ బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వైసీపీ మండిపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించింది. దీనిపై కూటమి ప్రభుత్వం ధీటుగానే స్పందించినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

జాగ్రత్త పడిన అనిత

ఏపీలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. వీటి నిరోధానికి హోమ్ శాఖ మంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఒకవేళ తనే హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇది సహజంగానే ఏపీ రాజకీయాలలో చర్చకు దారి తీసింది. అయితే దీనిని వైసిపి అందిపుచ్చుకొని రాజకీయం చేయకముందే వంగలపూడి అనిత వెంటనే స్పందించారు..” ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు వెతకడానికి ఏమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పోలీసు అధికారులు, నేను చర్చిస్తూనే ఉంటాం. అందులో పవన్ కళ్యాణ్ కూడా భాగమే. ఆయనకు ప్రతి విషయం తెలుసు. ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజం.. అందులో రాజకీయాన్ని వెతకడానికి ప్రయత్నించవద్దు. పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఆగ్రహం గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కేసు ఏమిటో కూడా మీకు తెలుసు. ఆయన ఆ స్థాయిలో కదిలిపోయారంటే అక్కడ ఎలాంటి దారుణం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై త్వరలో నేను ఆయనతో మాట్లాడుతాను. మీడియా సంచలనం కోసం ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు మెరుగ్గానే ఉన్నాయి. ఇందులో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ప్రభుత్వానికి శాంతి భద్రతల విషయంలో స్పష్టత ఉందని” అనిత వ్యాఖ్యానించారు..