High security for Paritala Sriram: రాయలసీమ( Rayalaseema ) అంటేనే రాజకీయ కక్షలకు కేరాఫ్ చిరునామా. నిత్యం సాక్ష్యం రాజకీయాలు అక్కడ రాజ్యమేలుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే అక్కడ అటువంటి పరిస్థితి లేదు. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ అదే పరిస్థితి. ఇటువంటి తరుణంలో ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ భద్రతపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. శ్రీరామ్ కు 2+2 భద్రత కల్పించాలని ఆదేశించింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామ్ కు అప్పట్లో ప్రభుత్వం భద్రత కల్పించింది. తరువాత వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తొలగించింది. ఈ క్రమంలో శ్రీరామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో భద్రత కల్పించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సుదీర్ఘ నేపథ్యం..
పరిటాల శ్రీరామ్( Paritala Sriram) దివంగత మాజీమంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు. పరిటాల రవి గురించి పరిచయం అక్కర్లేదు. ప్రజా ఉద్యమాలు ఊపిరిగా ఆ కుటుంబం జీవించింది. ఒకానొక దశలో మావోయిస్టుల ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు పరిటాల రవి. అటు తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పరిటాల రవి ఎక్కడ ఉన్నా ప్రజా క్షేమమే.. ప్రజలు హాయిగా బతకాలన్నది అభిమతంగా పనిచేశారు. రాయలసీమలో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి నేత 2005లో దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన భార్య సునీత. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. తిరిగి 2024లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే తల్లికి రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు పరిటాల శ్రీరామ్.
ధర్మవరం ఇన్చార్జిగా..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) యువనేతల్లో పరిటాల శ్రీరామ్ ఒకరు. 2019లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత అనంతపురంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. ముఖ్యంగా ధర్మవరంలో పరిస్థితి తీసికట్టుగా మారింది. అటువంటి సమయంలో ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు పరిటాల శ్రీరామ్ కు అప్పగించారు. అయితే 2014 నుంచి 2019 మధ్య పరిటాల సునీత మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఫ్యాక్షన్ జిల్లా కావడంతో ఆయన భద్రత కోసం అప్పట్లో ప్రభుత్వం గన్మెన్లను కేటాయించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ భద్రతను తొలగించింది. 2024 ఎన్నికల్లో ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు శ్రీరామ్. కానీ చివరి నిమిషంలో బిజెపికి ఆ స్థానాన్ని కేటాయించారు. సత్య కుమార్ యాదవ్ పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు శ్రీరామ్. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయనకు ఇద్దరు గన్మెన్లు రానున్నారు. మొత్తానికైతే భద్రత విషయంలో పరిటాల శ్రీరామ్ తాను అనుకున్నది సాధించారు.