https://oktelugu.com/

AP High Court: హైకోర్టు సీరియస్.. వైసీపీ సోషల్ కార్యకర్తల నిర్బంధాలపై సంచలన ఆదేశాలు

ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టుపై స్పందించింది. విచారణను సక్రమంగా చేపడుతున్నారా? లేదా? అని ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Written By:
  • Rocky
  • , Updated On : November 8, 2024 / 06:37 PM IST

    AP High Court

    Follow us on

    AP High Court: రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు చాలామంది అరెస్టులు కూడా జరిగాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడవద్దని.. పార్టీ లీగల్ టీం అండగా ఉంటుందని అగ్రనేతలు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో హైకోర్టులో పెద్ద ఎత్తున హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఒకేసారి భారీ స్థాయిలో పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ నిర్బంధం పై దాఖలైన ఆరు హెబియస్ కార్పస్ పిటీషన్లను సైతం విచారణకు స్వీకరించింది. నిర్బంధంలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తల హక్కులు, చట్టాన్ని అమలు చేసే చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది న్యాయస్థానం.ఇటీవల పరిణామాల నేపథ్యంలో పోలీస్ శాఖ సోషల్ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రధానంగా అధికార పార్టీ కీలక ప్రజా ప్రతినిధులను దుయ్యబడుతూ సోషల్ మీడియాలో చాలా రకాల పోస్టులు దర్శనమిచ్చాయి. వ్యక్తిగతంగాదూషిస్తూ చాలామంది పోస్టులు పెట్టారు.దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది.పోలీస్ శాఖ కూడాప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వైసిపి అనుకూల సోషల్ మీడియా ప్రతినిధుల పై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అరెస్టులు కూడా జరిగాయి. దీంతో బాధితుల తరుపున వైసిపి న్యాయపోరాటానికి సిద్ధమయింది. అందులో భాగంగానే పిటీషన్లు దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

    * ఒకేసారి ఆరు పిటిషన్లు
    ప్రధానంగా సోషల్ మీడియా కార్యకర్తలు జింకల రామాంజనేయులు,తిరుపతి లోకేష్,మునగల హరీశ్వర్ రెడ్డి,నొక్కిన శ్యామ్,పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి, మహమ్మద్ ఖాజా బాషా తదితరులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఈ పిటీషన్లు దాఖలు చేశారు. మూడు రోజుల కిందట అరెస్టులు జరిగాయని.. ఇంతవరకు కోర్టుకు హాజరు పరచలేదని హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. కనీసం ఆహారం కూడా పెట్టడం లేదంటూ కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు సీరియస్ గా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు కావడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఉదయమే విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను షెడ్యూల్ చేసింది.విచారణకు హాజరుకావాలని అడ్వకేట్ జనరల్ కు సమానులు కూడా పంపింది.

    * సిసి పుటేజీలు ఇవ్వాల్సిందే
    విచారణలో భాగంగా కోర్టు ముందు కీలక అంశాలను పెట్టారు పిటీషనర్ల తరఫున న్యాయవాదులు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా సీరియస్ అయ్యింది. అక్రమ నిర్బంధాలపై సంబంధిత పోలీస్ స్టేషన్ ల నుంచి సి సి ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈనెల నాలుగు నుంచి నాలుగు రోజులపాటు వాటిని అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పౌర స్వేచ్ఛను కాపాడడంలో తమకు బాధ్యత ఉందని కూడా తెలిపింది. చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా? లేదా? అన్నది తప్పకుండా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.