Nara Lokesh Padayatra : నారా లోకేష్ యువగళం యాత్రకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే లోకేష్ పాదయాత్రకు అనుమతి రద్దు చేయండని హైకోర్టు స్పష్టం చేసింది. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఏపీ ప్రభుత్వం తరుఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన హైకోర్టు యువగళం యాత్రలో రెచ్చిపోయి రొచ్చు చేస్తే అనుమతి రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
చిత్తూరు జిల్లా అంగళ్లు వద్ద ఘటనపై పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్లో.. అలాగే పుంగనూరు ఘటనలో తమపై నమోదైన కేసుల్లో టీడీపీ నేతలు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం యాత్రలో భాగంగా మంగళపర్రు గ్రామంలో లోకేష్ చర్చివైపు వేలు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని..దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారని చెప్పారు. లోకేష్ బహిరంగంగానే టీడీపీ శ్రేణులను దాడులకు ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కనీసం 12 నుంచి 20 కేసులున్న కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించే బాధ్యత తనదంటూ లోకేష్ ప్రతీ సభలోనూ బహిరంగంగా చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులోనూ ఇదే రీతిలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి తీవ్రంగా గాయపరిచారని హైకోర్టు దృష్టికి ఏజీ తెలిపారు. అందుకే పుంగనూరు ఘటనలో టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ లను తీవ్రంగా వ్యతిరేకించామని.. బెయిల్ ఇస్తే ఇలాంటివి ఇంకా జరుగుతాయని ఆరోజు మొత్తుకుంటున్నామన్నారు. పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని టీడీపీ నేతల అరాచకాలు ఎలా ఉంటాయో వివరించామన్నారు. కేసులు పెడితే వెంటనే హైకోర్టుకు వస్తున్నారని.. అదే వారి ధైర్యం అని అన్నారు.
సమస్యలు సృష్టిస్తున్నారనుకుంటే యువగళం యాత్రకు అనుమతి రద్దు చేయండని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితోనే కదా లోకేష్ యాత్ర చేస్తోంది.. అలాంటప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు పాదయాత్రను రద్దు చేయండని హైకోర్టు సూచించింది.
టీడీపీ లాయర్లు లోకేష్ పాదయాత్రకు ముడిపెట్టడంపై పెద్దగా అరుస్తూ అభ్యంతరం తెలుపడంతో హైకోర్టు జడ్జీలు సీరియస్ అయ్యి ‘ఇది చేపల మార్కెట్ అనుకుంటున్నారా’ అంటూ సీరియస్ అయ్యింది.