AP Weather Report : ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. చలిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన పొగ మంచు పడుతోంది. ఈ క్రమంలో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. అయితే ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బంగాళాఖాతం నుంచి హెచ్చరిక వచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వైపు దిశగా పైనుంచి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఎల్లుండి అల్పపీడనంగా మారనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. 24 నుంచి రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
* వరుస అల్పపీడనాలు
ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మరో రెండు రోజుల తర్వాత వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఏపీ పై ప్రభావం చూపుతున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏపీ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఈనెల 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
* రైతులు, మత్స్యకారులు ఆందోళన
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్నాయి. ఇప్పుడు వర్ష హెచ్చరికలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని అధికారులు దండోరా వేయించారు. అయితే గత కొద్ది రోజులుగా తుఫానుల ప్రభావంతో మత్స్యకారులు ఉపాధికి దూరమవుతున్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం విపరీతం గా చలి ఉంది. ఇటువంటి సమయంలో వర్షాలు పడుతాయని చెబుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.