AP Heavy Rain Alert: ఏపీలో( Andhra Pradesh) వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకొని.. రాయలసీమ జిల్లాల వరకు భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా రాయలసీమలో వర్షం ఎక్కువగా ఉంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం రిజర్వాయర్ కు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తోంది.
బలపడిన వాయుగుండం.. బంగాళాఖాతంలో( Bay of Bengal) వాయువ్యానికి, మద్యస్థంగా ఏర్పడిన అల్పపీడనం తీవ్రం అవుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిస్సా దక్షిణ ప్రాంతం, ఉత్తరాంధ్రకు మధ్య వాయుగుండం గా బలపడింది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం వైపు కదులుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సమీపంలోని.. ఒడిస్సా గోపాల్ పూర్ సమీపంలో ఇది తీరం దాటనుంది. వాయుగుండం తీరానికి సమీపిస్తున్న సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
నేడు ఈ జిల్లాల్లో వర్షం..
వాయుగుండం ప్రభావంతో నేడు కృష్ణా( Krishna district), ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. వాయుగుండం ప్రభావంతో గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం నమోదయింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యధికంగా 115.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కృష్ణా జిల్లా బాపులపాడు లో 103.7, అనంతపురం జిల్లా ఆత్మకూరులో 96.5, కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో 89, నంద్యాల జిల్లా మహానందిలో 86.2, పాణ్యం లో 82.5, పెద్ద కడుబూరులో 79, దేవనకొండలో 75, వెల్దుర్తిలో 74.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా యాటపాకలో 78.2 మిల్లీమీటర్ల వర్షం పడింది.