Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి.శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండం గా బలపడే అవకాశం కనిపిస్తోంది.దీంతో ఏపీ ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో సైతం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 36 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరం వైపు కదులుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం భారీ వర్షాలు నమోదు అవుతాయని.. ఆదివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విశాఖ, అనకాపల్లి,ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, కృష్ణ,కాకినాడ, అల్లూరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఈరోజు జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. సెప్టెంబర్ 6న నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
* రికార్డ్ స్థాయిలో నమోదు
అల్పపీడన ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అల్లూరి జిల్లా కుంతలంలో 45.5, కడప జిల్లా పెద్ద వసుపల్లలో 37, అనకాపల్లి జిల్లా పరవాడలో 35.29, ప్రకాశం జిల్లా ఈదరలో 34.5, నంద్యాల జిల్లా పెద్ద దేవలాపురంలో 34, కాకినాడ జిల్లా చొల్లంగి పేటలో 30 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 124 చోట్ల పది మిల్లీమీటర్ల పైనే వాన పడింది.
* తెలంగాణలో
అటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. శనివారం అదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.