AP Rain Alert: ఉత్తరాంధ్రకు( North Andhra ) భారీ వర్ష సూచన. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిస్సా వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని కూడా చెబుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: సో ఇప్పుడు ఆ డిజిటల్ పేపర్ కూడా చదివేవాడు లేడు.. పాపం ఆ యాజమాన్యానికి సినిమా అర్థమైంది..
* తీరం వెంబడి ఈదురు గాలులు..
అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తోంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అల్పపీడనాల ఏర్పడేందుకు అనువైన కాలంగా ఉంది. వచ్చేవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖ లోని గాజువాకలో రికార్డు స్థాయిలో వర్షం నమోదయింది. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం పడింది. 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలో సైతం భారీ వర్షాలు నమోదయ్యాయి. నక్కపల్లి లో 5.4 సెంటీమీటర్లు, వేంపాడులో 4.45 సెంటీమీటర్లు వర్షం కురిసింది.
* గాజువాకలో వరద బీభత్సం..
భారీ వర్షం కారణంగా గాజువాకలో( Gajuwaka) వరద బీభత్సం సృష్టించింది. బస్టాప్ లలోకి వరద నీరు చొచ్చుకు రావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వాహనదారులకు సైతం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉంది. తొమ్మిది నుంచి పది లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని జలవనురుల శాఖ అధికారులు చెబుతున్నారు. నదిలో నీటి ఉధృతి పెరిగిన నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని.. వినాయక నిమజ్జనోత్సవం లో జాగ్రత్తలు పాటించాలని ఆయా గ్రామాల్లో దండోరాలు కూడా వేశారు.