AP Rain Alert: ఏపీకి ( Andhra Pradesh)భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిస్సా తీరాల్లో ఇది కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు.. తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం కూడా ధ్రువీకరించింది. ఈ నెలలో వర్షాలు భారీగా నమోదయ్యాయి. అల్పపీడనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కానీ తాజాగా ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
* అల్పపీడనాలకు అవకాశం..
ఈ నెలలో బంగాళాఖాతంలో( Bay of Bengal) అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉంది. అదే సమయంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంటే మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే వాతావరణంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇంకోవైపు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు.. సాయంత్రానికి జల్లులు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో చాలాచోట్ల భారీ వర్షం పడింది. అత్యధికంగా గుంటూరు జిల్లా నల్లపాడు లో 71.5 మిల్లీమీటర్లు, కాకమానులో 52, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు లో 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* ఈరోజు నుంచి రెండు రోజులపాటు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతాయి. శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయి. గురువారం తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వియ్యొచ్చు. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.