Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ గుజరాత్, మహారాష్ట్ర, కేరళ రాస్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సగటున నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, నల్లగొండ, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో భానుడు దంచి కొడుతున్నాడు. దీంతో జనం వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు ఓపెన్ చేస్తున్నారు. శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.
ఐదు రోజులు బయటకు రావొద్దు..
ఇక రానున్న ఐదు రోజులు బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని, వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని తెలిపింది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. వేడి గాలులు ఇళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. బయట పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. స్కూల్ పిల్లలకు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే చాలా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.